
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు: మాజీ సిఎ౦ అశోక్ చవాన్‌పై టికెట్ల విక్రయం ఆరోపణలు
మహారాష్ట్రలో జనవరి 15న జరగనున్న మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలలో అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు అశోక్ చవాన్‌పై ఒక మాజీ కార్పొరేటర్ తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బులు తీసుకుని టికెట్లు కేటాయించారని ఆయన ఆరోపించగా, చవాన్ ఆ ఆరోపణలను ఖండించారు.
మరాఠ్వాడా ప్రాంతంలోని నాందేడ్ నగరంలో, అశోక్ చవాన్‌కు దీర్ఘకాల అనుచరుడిగా పేరున్న భానుసింగ్ రావత్ ఈ ఆరోపణలు చేశారు. ధనవంతులైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడానికి మాజీ సీఎం రూ. 50 లక్షలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. "డబ్బుకు బదులుగా టికెట్లు ఇవ్వడం ద్వారా పార్టీ తన విధేయులైన కార్యకర్తలను బలి ఇచ్చింది," అని రావత్ విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న నిబద్ధత కలిగిన బీజేపీ కార్యకర్తలను పక్కన పెట్టారని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ చవాన్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ, "నేను ఎవరినీ డబ్బులు అడగలేదు. సామాజిక జీవితంలో నాకు 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. నేనెప్పుడూ ఇలాంటి పనులు చేయలేదు," అని స్పష్టం చేశారు.
1980 నుండి చవాన్‌తో కలిసి రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ, ఆయనకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రావత్.. వార్డు నంబర్ 16 నుండి తన కుమారుడి కోసం బీజేపీ టికెట్ ఆశించారు. అయితే, పార్టీ చివరి నిమిషంలో నామినేషన్‌ను నిరాకరించింది.
మరోవైపు, జనవరి 15న జరగనున్న నాగ్‌పూర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శుక్రవారం నాడు ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తమ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోకుండా ఉండేందుకు బీజేపీ కార్యకర్తలు ఆయనను ఇంటి లోపల పెట్టి తాళం వేశారు.
వార్డు సంఖ్య 13 (డి) నుండి బీజేపీ తమ 'ఏబీ'ఫారమ్‌లో విజయ్ హోలే, కిసాన్ గవాండేలను అభ్యర్థులుగా పేర్కొంది. అయితే, చివరి నిమిషంలో పోటీ నుండి తప్పుకోవాలని గవాండేను పార్టీ నాయకత్వం ఆదేశించింది.
వార్డు 13 (డి) పరిధిలోని హజారీపహాడ్ ప్రాంతానికి ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటున్న స్థానిక బీజేపీ కార్యకర్తలు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవాండే రిటర్నింగ్ అధికారిని కలిసి నామినేషన్ ఉపసంహరించుకోకుండా అడ్డుకోవడానికి, మద్దతుదారులు ఆయనను ఇంట్లోనే బంధించి నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న బీజేపీ ఎమ్మెల్సీ పరిణయ్ ఫుకే, ఇతర స్థానిక నేతలు అక్కడికి చేరుకుని కార్యకర్తలను శాంతింపజేశారు. అనంతరం గవాండే తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఈ సందర్భంగా గవాండే మాట్లాడుతూ, "నేను పోటీ చేయాలని ఈ ప్రాంత బీజేపీ కార్యకర్తలు కోరుకున్నారు. అందుకే వారు అసహనానికి గురయ్యారు. అయితే పార్టీ నాయకత్వ నిర్ణయాన్నిమేము గౌరవిస్తున్నాము, అందుకే నా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాను," అని తెలిపారు.
కాగా నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా మొత్తం 29 స్థానిక సంస్థలకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మరుసటి రోజే (జనవరి 16న) చేపట్టనున్నారు.
