Let's talk: editor@tmv.in
మహారాష్ట్ర ‘మంత్రాలయం’లో లంచం పర్వం: సర్కార్‌పై కాంగ్రెస్ నిప్పులు!

మహారాష్ట్ర ‘మంత్రాలయం’లో లంచం పర్వం: సర్కార్‌పై కాంగ్రెస్ నిప్పులు!

Dantu Vijaya Lakshmi Prasanna
14 ఫిబ్రవరి, 2026

మహారాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కేంద్రమైన 'మంత్రాలయం'లో అవినీతి నిరోధక శాఖ గురువారం సాయంత్రం భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఆహార ఔషధ పరిపాలన విభాగంలో పనిచేస్తున్న రాజేంద్ర ధేరంగే అనే క్లర్క్, రూ. 35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. పకడ్బందీ భద్రత ఉండే సచివాలయంలోనే ఈ ఘటన జరగడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

లైసెన్స్ కోసం రూ.50 వేలు లంచం డిమాండ్

మెడికల్ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని కోరుతూ ఒక వ్యక్తి ఎఫ్.డి.ఏ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ పని పూర్తి చేయడానికి క్లర్క్ రాజేంద్ర ధేరంగే రూ.50,000 లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు నిందితుడిని పట్టుకోవడానికి పక్కా వ్యూహంతో వల పన్నారు.

గురువారం సాయంత్రం మంత్రాలయంలోని ఎఫ్.డి.ఏ కార్యాలయంలో బాధితుడి నుండి మొదటి విడతగా రూ. 35,000 తీసుకుంటుండగా ఏసీబీ బృందం ధేరంగేపై దాడి చేసింది. లంచం డబ్బుతో సహా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సచివాలయం వంటి కీలక ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో సూచిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

రాజకీయ రచ్చ:

ఈ ఘటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ మాట్లాడుతూ, నిందితుడు ఏకంగా ఒక క్యాబినెట్ మంత్రి కార్యాలయంలో పట్టుబడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. మహాయుతి ప్రభుత్వంలో మంత్రుల అండతోనే ఇలాంటి వసూళ్లు జరుగుతున్నాయని, కమిషన్లు లేనిదే సచివాలయంలో ఏ పనీ కావడం లేదని ఆయన విమర్శించారు.

మంత్రి రాజీనామా డిమాండ్:

ఈ వ్యవహారంలో సంబంధిత మంత్రిని వెంటనే పదవి నుండి తొలగించాలని సప్కాల్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనపై పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. సచివాలయ గౌరవాన్ని మంటగలిపేలా ఇలాంటి పనులు జరగడం "షాకింగ్" అని ఆయన అభివర్ణించారు. కాగా, మంత్రి నరహరి జిర్వాల్ స్పందిస్తూ, తనకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని, ఒకవేళ ప్రమేయం ఉన్నట్లు తేలితే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.

ప్రస్తుతం ఏసీబీ అధికారులు రాజేంద్ర ధేరంగేపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ లంచం వ్యవహారంలో అతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నతాధికారుల హస్తం ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మంత్రాలయం రెండో అంతస్తులోని కార్యాలయంలో జరిగిన ఈ దాడి అటు అధికారులలో, ఇటు ఉద్యోగులలో ప్రకంపనలు సృష్టించింది.

మహారాష్ట్ర ‘మంత్రాలయం’లో లంచం పర్వం: సర్కార్‌పై కాంగ్రెస్ నిప్పులు! - Tholi Paluku