Let's talk: editor@tmv.in
మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్

మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్

Pinjari Chand
1 ఫిబ్రవరి, 2026

ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన ఎన్‌సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ శనివారం మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. 62 ఏళ్ల సునేత్రా పవార్‌తో రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించేందుకు ముందు ఆమె రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదే రోజు ఉదయం రాష్ట్ర ఎన్‌సీపీ శాసనసభా పక్ష నాయకురాలిగా సునేత్రా పవార్ ఎన్నికయ్యారు. బీజేపీ–శివసేన–ఎన్‌సీపీ మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అజిత్ పవార్ జనవరి 28న బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం అనంతరం పార్టీ నేతృత్వ బాధ్యతలు సునేత్రా పవార్‌కు అప్పగించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సునేత్రా పవార్ ప్రమాణం చేసేందుకు లేచిన సమయంలో ‘అజిత్ దాదా అమర్ రహే’ అనే నినాదాలు వినిపించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఎన్‌సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కారే, ఛగన్ భుజ్‌బల్ తదితరులు హాజరయ్యారు. సునేత్రా పవార్ చిన్న కుమారుడు జయ్ పవార్, ఆయన భార్య కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సునేత్రా పవార్ రాష్ట్ర శాసనసభ లేదా మండలిలో సభ్యురాలు కాదు. అందువల్ల, ఆమె భర్త ప్రాతినిధ్యం వహించిన బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంది.

రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ సునేత్రా పవార్ చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. బారామతిలో తన వదిన, ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) నేత సుప్రియా సూలేకు ఎదురుగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు.

సునేత్రా పవార్ ముందున్న ప్రధాన సవాళ్లు

ఎన్‌సీపీని ఏకతాటిపై నిలబెట్టడం, అలాగే బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో కలిసి సంకీర్ణ రాజకీయాలను సమర్థంగా నిర్వహించడం. అంతేకాదు, రెండు ఎన్‌సీపీ వర్గాల విలీనంపై తుది నిర్ణయం తీసుకోవడం కూడా ఆమెకు తక్షణ కీలక బాధ్యతగా మారింది.

ఎన్‌సీపీ భవిష్యత్తు ఆమె చేతుల్లోనే

మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన పవార్ కుటుంబానికి చెందినప్పటికీ ఇప్పటివరకు పెద్దగా వెలుగులోకి రాని సునేత్రా పవార్, ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. భర్త, ఎన్‌సీపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణంతో ఏర్పడిన పరిస్థితుల్లో, సునేత్రా పవార్ శనివారం మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) భవిష్యత్తును నడిపించే కీలక బాధ్యత కూడా ఆమె భుజాలపై పడింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఎన్‌సీపీకి మాత్రమే కాకుండా, మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టే.

రాజకీయ నేపథ్యం ఉన్నా

మరాఠ్వాడ ప్రాంతంలోని ధారాశివ్ (మాజీ ఉస్మానాబాద్) జిల్లా తేరా గ్రామానికి చెందిన సునేత్రా పవార్, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలోనే జన్మించారు. ఆమె తండ్రి బాజీరావు పాటిల్, హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి ముందు జరిగిన మరాఠ్వాడ విమోచన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆమె సోదరుడు పద్మసింహ్ పాటిల్ సీనియర్ ఎన్‌సీపీ నేత. అయితే, రాజకీయ కుటుంబానికి చెందినప్పటికీ, సునేత్రా పవార్ చాలాకాలం పాటు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. వాణిజ్యశాస్త్రంలో పట్టభద్రురాలైన ఆమెకు చిత్రకళ, సంగీతం, ఫోటోగ్రఫీ, వ్యవసాయం అంటే ప్రత్యేక ఆసక్తి. వివాహానంతరం బారామతి సమీపంలోని కటేవాడి గ్రామంలో వ్యవసాయంపై దృష్టి సారించారు.

2024తో రాజకీయ ప్రవేశం

1999లో శరద్ పవార్ స్థాపించిన ఎన్‌సీపీ, 2023లో అజిత్ పవార్ బీజేపీ–శివసేన (శిందే వర్గం) మహాయుతి ప్రభుత్వంలో చేరడంతో రెండు వర్గాలుగా చీలిపోయింది. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగారు. ఈ నేపథ్యంలోనే, సునేత్రా పవార్ 2024 లోక్‌సభ ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతి నుంచి, తన అత్త, ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియ సూలేకు ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు.

సామాజిక సేవే బలం

రాజకీయాల కంటే ముందే, సునేత్రా పవార్ సామాజిక, పర్యావరణ రంగాల్లో తనదైన ముద్ర వేశారు. 2010లో ఆమె ఎన్‌విరాన్‌మెంట్ ఫోరం ఆఫ్ ఇండియా (ఈఎఫ్ఓఐ) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా పర్యావరణ అవగాహన, జీవ వైవిధ్య పరిరక్షణ, నీటి వనరుల నిర్వహణ, కరువు నివారణ వంటి అంశాలపై విస్తృతంగా పనిచేశారు. భారతదేశంలోనే తొలిసారిగా ‘ఎకో-విలేజ్’ నమూనాను అమలు చేసి, కటేవాడి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. స్వచ్ఛత, ఆరోగ్యం, పశుసంరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల్లో ఆమె ముందుండి నడిపించారు.

విద్య, ఉపాధి రంగాల్లో పాత్ర

శరద్ పవార్ స్థాపించిన విద్యా సంస్థ ‘విద్యా ప్రతిష్ఠాన్’కు ట్రస్టీగా కూడా సునేత్రా పవార్ వ్యవహరిస్తున్నారు. ఫ్రాన్స్ కేంద్రంగా ఉన్న వరల్డ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఫోరమ్ థింక్‌ట్యాంక్ సభ్యురాలిగా, అంతర్జాతీయ వేదికలపై భారత్ తరఫున సస్టైనబిలిటీ, సామాజిక ఆవిష్కరణలపై మాట్లాడారు. అలాగే, బారామతి హైటెక్ టెక్స్‌టైల్ పార్క్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో 15,000 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించే బహుళ విధాల వస్త్ర తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు.

ముందున్న సవాళ్లు

ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న పవార్ కుటుంబ సభ్యురాలు, ఇప్పుడు ఎన్‌సీపీని ఏకతాటిపైకి తెచ్చే కీలక పాత్రలోకి వచ్చారు. బీజేపీ, శిందే నేతృత్వంలోని శివసేనతో సమన్వయం, రాజకీయ సమీకరణలు నడపడం ఒకవైపు అయితే, మరోవైపు ఎన్‌సీపీ రెండు వర్గాల విలీనంపై నిర్ణయం తీసుకోవడం ఆమె ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది. రాజకీయ అనుభవం తక్కువైనా, సామాజిక సేవ, పరిపాలనా అనుభవం, పవార్ కుటుంబ రాజకీయ వారసత్వం — ఈ మూడింటి సమ్మేళనంతో సునేత్రా పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ స్థాయికి చేరుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రమాణ స్వీకారంపై నాకు ఎలాంటి సమాచారం లేదు: శరద్ పవార్

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారంపై తనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. అలాగే ఎన్‌సీపీ రెండు వర్గాల విలీనాన్ని ఫిబ్రవరి 12న ప్రకటించాలనే నిర్ణయాన్ని అజిత్ పవార్ తీసుకున్నారని ఆయన వెల్లడించారు. బారామతిలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం గురించి మాకు తెలియదు. వార్తల ద్వారానే తెలుసుకున్నాం. ఈ విషయంలో నాతో ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు.

సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారానికి పవార్ కుటుంబ సభ్యులు హాజరవుతారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ నేను కూడా ఆ కార్యక్రమం ఈ రోజే ఉందన్న విషయం తెలియదు. ఇది వారి పార్టీ (ఎన్‌సీపీ అజిత్ వర్గం) తీసుకున్న నిర్ణయం కావచ్చు అని తెలిపారు. ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కారే వంటి నేతలు ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ మరణం తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని ఎవరో ఒకరు చేపట్టాలనే భావనతో పాలక వర్గం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అన్నారు.

ఇదే సందర్భంగా, అజిత్ పవార్, ఎన్‌సీపీ (శరద్ వర్గం) నేత జయంత్ పాటిల్ గత నాలుగు నెలలుగా రెండు వర్గాల విలీనంపై చర్చలు జరుపుతున్నారని శరద్ పవార్ వెల్లడించారు. ఫిబ్రవరి 12న విలీన ప్రకటన చేయాలని అజిత్ నిర్ణయించారు. కానీ దురదృష్టవశాత్తు జనవరి 28న జరిగిన విమాన ప్రమాదం కారణంగా అది ఆగిపోయిందని చెప్పారు. అజిత్‌ను తిరిగి తీసుకురాలేం. ఇప్పుడు పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్నదే ప్రశ్న అని ఆయన భావోద్వేగంగా స్పందించారు. రెండు వర్గాలు కలిసి పనిచేయాలనే అంశంపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందని, ఆ ప్రక్రియ మొదలైందని తెలిపారు.

సునేత్ర పవార్ పేరును ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించే ముందు తనను సంప్రదించారా? అనే ప్రశ్నకు, వారి పార్టీ వేరు, మా పార్టీ వేరు. నన్ను సంప్రదించాల్సిన అవసరం ఏముంది? అని శరద్ పవార్ స్పష్టం చేశారు. ఈ పరిణామాల వెనుక బీజేపీ పాత్ర ఉందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. అజిత్ పవార్ మరణానికి కారణమైన విమాన ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించిందని, అన్ని కోణాలను పరిశీలిస్తుందని ఆయన తెలిపారు.