
మహారాష్ట్రలో శివాజీ–టిప్పు వ్యాఖ్యలపై రాజకీయ రగడ
మహారాష్ట్రలో శివాజీ మహారాజ్–టిప్పు సుల్తాన్ పోలిక వ్యాఖ్యలపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించగా, కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ‘డబుల్ స్టాండర్డ్స్’ పాటిస్తుందని ఆరోపించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, బీజేపీ గతంలో టిప్పు సుల్తాన్‌కు సంబంధించిన పేర్లను ప్రజా ప్రదేశాలకు పెట్టేందుకు మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు రాజకీయ లాభాల కోసం వ్యతిరేక ధోరణి అవలంబిస్తోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఆరోపణలు
సావంత్ పేర్కొన్న వివరాల ప్రకారం 2012లో అకోలా మున్సిపల్ కార్పొరేషన్‌లో ‘షహీద్-ఎ-వతన్ షేర్-ఎ-మైసూరు టిప్పు సుల్తాన్’ పేరిట స్టాండింగ్ కమిటీ హాల్‌కు పేరు పెట్టే తీర్మానానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. 2013లో ముంబై ఎం-ఈస్ట్ వార్డులో ‘షహీద్ టిప్పు సుల్తాన్ మార్గ్’ పేరిట రహదారి పేరు నిర్ణయానికి బీజేపీ కార్పొరేటర్లు మద్దతు ఇచ్చారు. 2001లో అంధేరి (వెస్ట్)లో ‘షేర్-ఎ-మైసూరు టిప్పు సుల్తాన్ మార్గ్’గా రహదారి పేరు నిర్ణయం ఏకగ్రీవంగా ఆమోదించింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్ యడియూరప్ప టిప్పు సమాధిని సందర్శించి కొనియాడారని సావంత్ పేర్కొన్నారు. 2017లో అప్పటి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కర్ణాటక అసెంబ్లీలో టిప్పు సుల్తాన్‌ను ప్రశంసించారని గుర్తు చేశారు. బీజేపీ గతంలో టిప్పు సుల్తాన్‌ను మెచ్చుకుని, ఇప్పుడు మత ధ్రువీకరణ రాజకీయాల కోసం అతనిపై వ్యతిరేక ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.
వివాదానికి కారణం
మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కార్యాలయంలో టిప్పు సుల్తాన్ చిత్రపటంపై వివాదం చెలరేగింది. ఈ సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్య ఆలోచనను ప్రతిపాదించిన విధానాన్ని ఉదాహరణగా చూపుతూ, టిపు సుల్తాన్ కూడా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటానికి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఈ పోలికపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
బీజేపీ స్పందన
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సప్కాల్ వ్యాఖ్యలను ఖండిస్తూ, శివాజీ మహారాజ్‌ను టిప్పుతో పోల్చడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు చర్యలని విమర్శించారు.
చరిత్రలో టిప్పు స్థానం
టిప్పు సుల్తాన్ చరిత్రలో వివాదాస్పద వ్యక్తిగా నిలిచాడు. కొందరు అతన్ని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడిగా కొనియాడుతుంటే, మరికొందరు మతపరమైన విధానాల కారణంగా విమర్శిస్తుంటారు. మొత్తానికి, శివాజీ–టిప్పు పోలికపై ప్రారంభమైన ఈ వివాదం మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ మతపరమైన చర్చలకు దారితీసింది.
శివాజీ–టిప్పు వ్యాఖ్యలపై పుణెలో ఉద్రిక్తత
బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల రాళ్లదాడి: 9 మందికి గాయాలు
మహారాష్ట్రలో శివాజీ–టిప్పు సుల్తాన్ వ్యాఖ్యలపై రాజకీయ ఉద్రిక్తత హింసాత్మకంగా మారింది. కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ సప్కాల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పుణెలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టగా, ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసరడంతో తొమ్మిది మంది స్వల్పంగా గాయపడ్డారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంజన్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు గాయపడ్డారని తెలిపారు. ఇరు పార్టీల కార్యకర్తలపై కేసులు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. కాంగ్రెస్ భవన్ సమీపంలో జరిగిన నిరసనలో ఇరు వర్గాలు గోడలపైకి ఎక్కి నినాదాలు చేయడంతో పాటు రాళ్లు విసిరినట్లు పోలీసులు పేర్కొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పుణే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్ శిండే మాట్లాడుతూ, బీజేపీ నాయకులపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశామని తెలిపారు. మేయర్ మంజూషా నాగ్‌పురే, నగర అధ్యక్షుడు ధీరజ్ ఘాటే, దుష్యంత్ మొహోల్ తదితరులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, బీజేపీ నగర అధ్యక్షుడు ధీరజ్ ఘాటే పార్వతి పోలీస్ స్టేషన్‌లో సప్కాల్‌పై హిందువుల భావోద్వేగాలను దెబ్బతీశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది.
