
మహారాష్ట్రలో ముస్లింల రిజర్వేషన్ రద్దు
మహారాష్ట్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో (జీఆర్) 2014లో ముస్లింలకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను అధికారికంగా రద్దు చేసింది. అయితే ఈ రిజర్వేషన్ ఇప్పటికే దాదాపు పదేళ్లకు పైగా చట్టపరంగా చెల్లుబాటుకాకుండా ఉందని అధికారులు తెలిపారు. 2014 జూలైలో ఆర్డినెన్స్ ద్వారా ముస్లింలను ప్రత్యేక వెనుకబడిన వర్గం-ఎ (ఎస్బీసీ-ఏ) కింద వర్గీకరించి, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ అమలు చేశారు. అయితే ఈ ఆర్డినెన్స్‌ను బాంబే హైకోర్టు నవంబర్ 14, 2014న నిలిపివేసింది. తరువాత డిసెంబర్ 23, 2014లోపు ఈ ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం శాసనసభలో బిల్లుగా ప్రవేశపెట్టలేదు. దీంతో అది ఆటోమేటిక్‌గా చెల్లుబాటు కోల్పోయింది. అనంతరం బాంబే హైకోర్టు ఉత్తర్వుపై దాఖలైన ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్ఎల్పీ)పై విచారణలో సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా కూడా రిజర్వేషన్‌ను రద్దు చేస్తూ తుది నిర్ణయం వెల్లడించింది. దీంతో ఈ నిబంధన పూర్తిగా చెల్లుబాటుకాకుండా పోయింది.
అయినా, ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటు కోల్పోయిన తరువాత కూడా ప్రభుత్వం అధికారికంగా పూర్వ ఉత్తర్వులను రద్దు చేయలేదు. తాజా ఉత్తర్వు ద్వారా అది పూర్తయింది. ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వుతో సంబంధిత అన్ని నిర్ణయాలు, సమాచారాలను చెల్లుబాటుకాకుండా ప్రకటించారు. దీంతో 5 శాతం రిజర్వేషన్ కింద ఇకపై కాలేజీలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు ఉండవు. అలాగే ఈ వర్గం కింద కొత్తగా కుల లేదా చెల్లుబాటు ధృవపత్రాలు కూడా జారీ చేయరు. అయితే తాజా ఉత్తర్వు ప్రధానంగా ఒక పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని, ఎందుకంటే ఈ రిజర్వేషన్ ఇప్పటికే సుప్రీంకోర్టు నిర్ణయం, ఆర్డినెన్స్ గడువు ముగియడం వంటి కారణాలతో దశాబ్దానికి పైగా అమల్లో లేదని అధికారులు స్పష్టం చేశారు.
రిజర్వేషన్ రద్దుపై మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు
మహారాష్ట్రలో ముస్లింలకు విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలులో ఉన్న 5 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేసిన నిర్ణయంపై ప్రతిపక్షం బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ‘మైనార్టీల వ్యతిరేకి’గా వ్యవహరిస్తోందని ఆరోపించింది. మహాయుతి కూటమిలో బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన(షిండే)లు భాగస్వాములుగా ఉన్నాయి. తిలక్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ మాజీ వర్కింగ్ కమిటీ సభ్యుడు నసీం ఖాన్, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్‌ను రద్దు చేయడం అత్యంత తప్పుడు నిర్ణయం అని పేర్కొన్నారు. దీని వల్ల మైనార్టీలు అభివృద్ధి ప్రధాన ప్రవాహంలో చేరే అవకాశాలను కోల్పోతారని అన్నారు. 2014లో అప్పటి కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రభుత్వం ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ మంజూరు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిందని గుర్తుచేశారు. అనంతరం ఏర్పడిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ కాలంలో ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేదని ఆరోపించారు. బాంబే హైకోర్టు తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా, అమలు జరగలేదని అన్నారు.
2014-15 విద్యాసంవత్సరంలో మాత్రమే రిజర్వేషన్ అమలైందని, తర్వాత హామీలు ఇచ్చినా కొనసాగించలేదని ఖాన్ పేర్కొన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు అవసరమైన సుమారు రూ.90 కోట్ల బదులు కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. మైనార్టీలలో ముస్లింలతో పాటు జైనులు, సిక్కులు, పార్సీలు కూడా ఉన్నారని పేర్కొంటూ, అన్ని వర్గాలకు సమాన అభివృద్ధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం మైనార్టీల వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఇదే విషయంపై ఎన్సీపీ (ఎస్పీ) ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ, ఈ నిర్ణయం బీజేపీకి ముస్లిం నాయకులపై గౌరవం లేదని నిరూపిస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీలో ఈ నాయకులకు న్యాయం దక్కదన్నారు. మునుపటి కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రభుత్వం మరాఠాలకు 16 శాతం, ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ మంజూరు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే మంగళవారం జారీ చేసిన ప్రభుత్వ తీర్మానం ప్రకారం, ప్రత్యేక వెనుకబడిన వర్గం (ఏ) కింద ముస్లింలకు విద్యా సంస్థలు, ఎయిడెడ్, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన అన్ని పూర్వ నిర్ణయాలు, ఆర్డినెన్స్‌లు రద్దు అయ్యాయి.
