
మహారాష్ట్రకు లభించని ‘ఉత్తమ ముఖ్యమంత్రి’ అజిత్ దాదా: ఫడ్నవీస్
ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ను మహారాష్ట్రకు లభించని ఉత్తమ ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం శాసనసభలో మాట్లాడుతూ మా ఇద్దరికీ పుట్టినరోజు ఒకటే. కానీ ఆయన నాకంటే 11 సంవత్సరాలు పెద్దవారు. నిజమైన అర్థంలో ఆయన నా ‘దాదా’, అని అన్నారు.
అజిత్ పవార్ రికార్డు స్థాయిలో ఆరు సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారని, రాష్ట్రాన్ని నడిపే సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పారు. అజిత్ దాదా మహారాష్ట్రకు దక్కని ఉత్తమ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. 2019లో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, అది కొనసాగలేదని, అయితే పవార్ తన మాటకు కట్టుబడి ప్రమాణస్వీకారం చేశారని ఫడ్నవీస్ గుర్తుచేశారు. కోర్టు తీర్పు తర్వాత పవార్ తన అసలు పార్టీలోకి తిరిగి వెళ్లారని వివరించారు. అతను ఏ రాజకీయ సౌజన్యానికి కట్టుబడని, నేరుగా మాట్లాడే నాయకుడని, మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తి అని కొనియాడారు.
ఆర్థిక వ్యవహారాల్లో నైపుణ్యం
ఫడ్నవీస్ ప్రకారం, అజిత్ పవార్ ఏ ముఖ్యమంత్రికైనా కావాల్సిన ఉత్తమ ఆర్థిక మంత్రి. ఈ సంవత్సరం ఆయన 12వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారని, వచ్చే ఏడాది 13 బడ్జెట్‌ల రికార్డును అధిగమించేవారని తెలిపారు. ‘లడ్కీ బహిన్’ పథకాన్ని ఆర్థిక శాఖ అభ్యంతరాలు ఉన్నప్పటికీ అమలు చేయడంలో పవార్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే మాట్లాడుతూ, ఫడ్నవీస్, పవార్, తాను ‘సమభుజ త్రిభుజం’లా ఉండేవాళ్లమని చెప్పారు. పవార్‌ను బయటకు ముళ్లతో ఉన్న పనసకాయ లాంటివాడు. లోపల మృదువైన, తీపి మనసున్న నాయకుడిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవార్ పరిపాలనపై మంచి పట్టు కలిగిఉండేవారని, పథకాల లోపాలను వేగంగా గుర్తించగలిగే నాయకుడని ప్రశంసించారు.
సన్నిహిత మిత్రుడు – ఉద్ధవ్ ఠాక్రే
శివసేన (ఉద్ధవ్ వర్గం) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా సభలో పవార్‌కు నివాళులు అర్పించారు. మొదట ఆయనపై అనుమానం ఉండేది. కానీ తర్వాత చాలా సన్నిహిత మిత్రుడయ్యారని చెప్పారు. కోవిడ్ సమయంలో పవార్ కీలక బాధ్యతలు నిర్వహించారని గుర్తుచేశారు. రాజకీయ కారణాల వల్ల వ్యక్తిని నిరంతరం అపవాదులు వేయడం సరైంది కాదని, దానికి ఒక హద్దు ఉండాలని ఠాక్రే వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడం కష్టమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. సభలో అన్ని పక్షాల నేతలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
అజిత్ పవార్ సెక్యులర్ విలువలు కలిగిన నాయకుడు: ముఫ్తీ ఇస్మాయిల్ ఖాస్మీ
మాజీ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్మరణార్థం మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన సంతాప తీర్మానంపై ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ముఫ్తీ ఇస్మాయిల్ ఖాస్మీ భావోద్వేగంగా స్పందించారు. అజిత్ పవార్ కేవలం మహారాష్ట్రలోనే కాక దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకుడని ఆయన పేర్కొన్నారు. అజిత్ పవార్ వ్యక్తిత్వంలో ముఖ్యమైన అంశం ఆయన సెక్యులర్ భావజాలమని ఖాస్మీ అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో కూడా అభిప్రాయ భేదాలు వచ్చినపుడు తన అభిప్రాయాలను స్పష్టంగా, నిర్మొహమాటంగా వ్యక్తం చేసేవారని గుర్తుచేశారు. ద్వేషపూరిత వాతావరణం తనకు నచ్చదని, ప్రేమతో రాజకీయాలు సాగించాలి, అందరికీ న్యాయం జరగాలి అనే సిద్ధాంతాన్ని ఆయన నమ్మేవారని తెలిపారు. మతం ఆధారంగా ఎవ్వరినైనా పక్కన పెట్టడం లేదా విస్మరించడం సరికాదని అజిత్ పవార్ ఎప్పుడూ చెప్పేవారని పేర్కొన్నారు. సమానత్వం, సామరస్యాన్ని కాపాడే విలువలను ఆయన జీవితాంతం పాటించారని అన్నారు. కీలక సందర్భాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనకు ఉందని కూడా కొనియాడారు. చాలా మంది ఆయన ముఖ్యమంత్రిగా మారాలని ఆశించారు. ఆయన సీఎం అయ్యి ఉంటే మహారాష్ట్ర మరింత అభివృద్ధి సాధించేదని మా నమ్మకమని ఖాస్మీ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో పలువురు సభ్యులు కూడా అజిత్ పవార్ సేవలను స్మరించుకుంటూ ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రశంసించారు. వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన పరిపాలనా అనుభవం, అభివృద్ధి పట్ల నిబద్ధత రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిందని సభ్యులు అభిప్రాయపడ్డారు. సంతాప తీర్మాన సమయంలో సభలో గంభీర వాతావరణం నెలకొంది. సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులు అర్పించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అజిత్ పవార్ మరణం రాష్ట్రానికి తీరని లోటుగా పలువురు నాయకులు అభివర్ణించారు.
జనవరి 28న పుణె జిల్లాలోని బరామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల తొలి రోజు సభలో పవార్‌కు ఘన నివాళులు అర్పించారు.
