
మహాదేవ్‌పూర్ పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన
మంథని నియోజకవర్గంలోని మహాదేవ్‌పూర్ మండలంలో అభివృద్ధి పనులకు వేగం పెంచుతూ పలు ముఖ్యమైన కార్యక్రమాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ముఖ్యంగా పవిత్ర క్షేత్రంగా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాంతంలో మౌలిక వసతులను మెరుగుపరచడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా కాళేశ్వరం నుంచి పలుగుల వరకు 7 కిలోమీటర్ల డబుల్ బీటీ రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ రహదారి పూర్తయితే ప్రాంతీయ రవాణాకు భక్తుల ప్రయాణానికి మరింత సౌకర్యం కలగనుంది. అలాగే కాళేశ్వరంలో రూ.1.20 కోట్ల వ్యయంతో మ్యూజియం నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. ఇదే సమయంలో ఆది ముక్తీశ్వర దేవస్థానం నుంచి సరస్వతీ ఘాట్ వరకు రూ.2.38 కోట్లతో బీటీ రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ రహదారి ద్వారా ఆలయాలను సందర్శించే భక్తులకు రాకపోకలు సులభతరం కానున్నాయి.
భక్తులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రూ.1.55 కోట్ల వ్యయంతో నిర్మించిన అన్నదాన సత్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సత్రం ద్వారా క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఆహార వసతి సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ
సామాజిక సంక్షేమంలో భాగంగా కాళేశ్వరం, అన్నారం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. సొంత ఇంటి కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేయడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా రానున్న సరస్వతీ అంత్య పుష్కరాలు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కాళేశ్వరం ఈవో కార్యాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రహదారులు, పారిశుధ్యం, విద్యుత్ భద్రతా అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.
