Let's talk: editor@tmv.in
మహాత్మా జ్యోతిబా ఫూలేకు ఘన నివాళి
మహాత్మా జ్యోతిబా ఫూలేకు ఘన నివాళి

మహాత్మా జ్యోతిబా ఫూలేకు ఘన నివాళి

Panthagani Anusha
12 ఏప్రిల్, 2026

భారతదేశ సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 200వ జయంతి వేడుకలు శనివారం దేశ రాజధానిలో ఘనంగా జరిగాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని 'ప్రేరణ స్థల్' వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసి జ్యోతిరావ్ ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణంలో ఫూలే చేసిన త్యాగాలను అందించిన సేవలను వారు స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘ్వాల్‌తో పాటు రాజ్యసభ మాజీ ఉపాధ్యక్షుడు హరివంశ్ తదితర ప్రముఖులు పాల్గొని అంజలి ఘటించారు

దేశవ్యాప్తంగా జయంతి ఉత్సవాలు

గత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించిన విధంగా ఫూలే 200వ జయంతి వేడుకలను ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ "జ్యోతిబా ఫూలే సిద్ధాంతాలే మా ప్రభుత్వానికి మార్గదర్శకాలు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం, పేదల అభివృద్ధిని పారదర్శక విధానాలతో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ఫూలే ఆలోచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి అని స్పష్టం చేశారు.

సామాజిక న్యాయానికి ఫూలే ఆదర్శం: రాహుల్ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సైతం ఫూలేకు ఘన నివాళులర్పించారు. వివక్ష, అసమానతలపై ఫూలే చేసిన పోరాటం దేశానికి సమానత్వం, న్యాయం వైపు మార్గదర్శనం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఫూలే తన జీవితాన్ని అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు అంకితం చేశారని ఆయన ఆశయాలు సామాజిక న్యాయం దిశగా దేశం ముందుకు సాగడానికి ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయని ఎక్స్ వేదికగా నివాళులర్పించారు .

సామాజిక సంస్కరణల పితామహుడు

1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారాలో జన్మించిన జ్యోతిరావ్ ఫూలే అంటరానితనం నిర్మూలనకు, మహిళా విద్యకు ప్రాణం పోశారు. తన భార్య సావిత్రిబాయి ఫూలేతో కలిసి దేశంలోనే తొలి బాలికల పాఠశాలను ప్రారంభించి విద్యా విప్లవానికి పునాది వేశారు. అణగారిన వర్గాలకు సమాన హక్కుల కోసం ఆయన స్థాపించిన ‘సత్యశోధక్ సమాజ్’ భారత సామాజిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.

కార్యక్రమంలో మోడీ–రాహుల్ మధ్య స్వల్ప సంభాషణ

ప్రముఖ సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా పార్లమెంట్‌ భవన్‌ ప్రాంగణంలో జరిగిన నివాళి కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మధ్య జరిగిన స్వల్ప సంభాషణ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి ప్రజా కార్యక్రమాల్లో ఇద్దరూ పరస్పరం అభివాదం చేసుకోవడం తప్ప ఎక్కువగా మాట్లాడటం అరుదుగా కనిపించడంతో ఈ చిన్న సంభాషణ ప్రత్యేకంగా నిలిచింది. ప్రధాని మోడీ మహాత్మా ఫూలే విగ్రహానికి పుష్పాంజలి అర్పించేందుకు వచ్చినప్పుడు అక్కడ ఇప్పటికే పలువురు ప్రముఖులు నిలబడి ఉన్నారు. వారిలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. అందరిని నమస్కరిస్తూ ముందుకు వచ్చిన మోడీ, రాహుల్ గాంధీ దగ్గర ఆగి కొద్దిసేపు మాట్లాడారు.