Let's talk: editor@tmv.in
మహాఘట్భంధన్‌లో విభేదాలు లేవు:తేజస్వీ యాదవ్

మహాఘట్భంధన్‌లో విభేదాలు లేవు:తేజస్వీ యాదవ్

Pinjari Chand
23 అక్టోబర్, 2025

మహాట్భంధన్‌లో విభేదాలపై వస్తున్న వార్తలను తేజస్వీ కొట్టిపారేశారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కొన్ని సీట్ల మధ్య విబేధాలు ఉండటం సహజమే. అయితే అవన్నీ ఎన్నికల నాటికి సమసిపోతాయని తెలిపారు. బీహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బుధవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచార ప్రణాళికలను ప్రకటించారు. రేపు మీకు అన్ని సమాధానాలు లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా తేజస్వీ మాట్లాడుతూ అక్టోబర్ 24నుంచి మహాఘట్భంధన్‌ ప్రచారం ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని, ప్రస్తుతం ప్రచారం నిర్వహించే సమయం వచ్చిందన్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఏం చేయాలనేది స్పష్టంగా ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం దూరదృష్టితో ఎటువంటి పథకాలు చేపట్టడం లేదు. మేం చెబుతున్న పథకాలనే వారు చెబుతున్నారు.

గురువారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని తేజస్వీ అన్నారు. తేజస్వీ యాదవ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విమర్శలు చేశారు. అతను దేశంలోనే అత్యంత బలహీనమైన సీఎం అని, ఎవరైనా అతనిపై అరవగలరని, అతను ఇక ముఖ్యమంత్రి కాదని స్పష్టమైందన్నారు. తాము అధికారంలో వచ్చాక చేపట్టబోయే పలు సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలను తేజస్వీ యాదవ్ ఈ సందర్భంగా ప్రకటించారు. జీవికా దిదీ పథకం, దీంట్లో భాగంగా మహిళలకు నెలకు రూ.2500 ఇస్తారు. అలాగే సంవత్సరానికి, రూ.30,000 ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు. అలాగే బ్యాంకులో తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేస్తామన్నారు. రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామన్నారు.ఎన్డీయే ప్రభుత్వం మా పథకాలను కాపీ కొడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బేటీయోజన, మా యోజన పథకాన్ని కూడా ప్రకటించారు.

రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం నడవలేని స్థితిలో ఉంది. వారి పట్ల ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తోంది. ప్రభుత్వంలో అవినీతి పెరిగింది. మేం నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తాం. కచ్చితంగా ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామన్నారు.గతంలోనే మేం మా, బెహన్ పథకాన్ని ప్రకటించాం. దీన్ని ఎన్డీయే కాపీ కొట్టి మహిళా ముఖ్యమంత్రి యోజనను తీసుకొచ్చింది. మేం తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి . తేజస్వీ యాదవ్ బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోత్‌ను కలిశారు. మహాట్భంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరును అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

మహాఘట్బంధన్ ఐక్యంగా ఉంది: అశోక్ గెహ్లట్

మహాఘట్బంధన్ ఐక్యంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లట్ బుధవారం ప్రకటించారు. మహాఘట్బంధన్ ఐక్యంగా ఉందని. ఆయన ఏఐసీసీ బీహార్ ఇన్‌చార్జ్ కృష్ణ అల్లవారుతో కలిసి ఆర్జేడీ నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్‌లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా గెహ్లట్ మాట్లాడుతూ రేపు మహాఘట్బంధన్ (విపక్ష కూటమి) భారీ స్థాయిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుందని, బీహార్‌లో విభేదాలు ఉన్నాయన్న వాదనలను తిప్పికొట్టారు. ఈ ఎన్నికలను బలంగా ఎదుర్కొంటుంది. రేపటి మహాఘట్బంధన్ మీడియా సమావేశంలో మొత్తం పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తాం అని ఆయన పేర్కొన్నారు. బీజేపీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బీహార్‌లో ఇండియా కూటమిలో విభేదాలు ఉన్నట్లు చూపించడానికి బీజేపీ చాలా పకడ్బందీగా ప్రచారం చేస్తోందన్నారు.