Let's talk: editor@tmv.in
మహాఘట్‌బంధన్ సీట్ల కేటాయింపుపై కసరత్తు

మహాఘట్‌బంధన్ సీట్ల కేటాయింపుపై కసరత్తు

Aravind Maryada Reddy
10 అక్టోబర్, 2025

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాజకీయ వేడి రాజుకున్నది. ఎన్డీయే, మహాఘట్‌బంధన్ రెండు కూటములు వ్యూహాలకు పదునుపెట్టాయి. అయితే ఆర్జీడీ, కాంగ్రెస్ పార్టీ మధ్య సీట్ల కేటాయింపు అంశం ఇంకా తేలలేదు. దీంతో తరుచూ సమావేశాలు జరుగుతున్నాయి. తాజాగా తేజస్వీ యాదవ్‌తో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. గురువారం సాయంత్రం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సీనియర్ పరిశీలకులు అశోక్ గెహ్లోట్, అడిర్ రంజన్ చౌధరి, భూపేష్ బఘెల్ తేజస్వీ యాదవ్‌తో పట్నాలో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో మహాఘట్‌బంధన్ కూటమిలోని పార్టీల మధ్య సీటు పంచుకోవడంపైనే ఉండనున్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆర్జేడీ, సీపీఐ, సీపీఐ (ఎంల్) తో కూటమిలో ఉంది. సీట్ల పంపిణీ విషయంలో ఇంకా చర్చలు ఓ కొలిక్కి రాలేదు. “మహా గఠబంధన్‌లో సీటు పంచుకోవడం త్వరలోనే పూర్తవుతుంది. సమన్వయ కమిటీ నిరంతరం సమావేశాలు నిర్వహిస్తోంది.” అని కాంగ్రెస్ నేత తారీఖ్ అన్వర్ పేర్కొన్నారు. “నితీశ్ కుమార్‌ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించడంలో ఇంకా గందరగోళం ఉంది. మహాఘఠ్‌బంధన్ వైపు తేజశ్వి యాదవ్ నేతగా వ్యవహరిస్తున్నారని స్పష్టంగా చెప్పవచ్చు,” అన్నారు.

సీట్ల కేటాయింపు

కాంగ్రెస్ ఇంకా ఆర్జేడీతో సీటు పంచుకోవడంపై తుది నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ నేత తారీఖ్ అన్‌వార్ చెబుతున్నారు, సమన్వయ కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయని, సీటు పంచుకోవడం త్వరలో తుది రూపంలో నిర్ణయించబడుతుందని. ఇది సాధారణ రాజకీయ ప్రక్రియలో భాగమేనన్నారు.

కూటమిలో ఇబ్బందులు ఏమిటి?

బీహార్‌లో మహాగట్ బంధన్ కూటమిలో కాంగ్రెస్‌, ఆర్జేడీతోపాటు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. కూటమిలో సీట్ల కేటాయింపు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నట్టు సమాచారం. ఆర్జేడీ దాదాపు 140 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. కానీ కాంగ్రెస్‌కు 54 సీట్లు ఇవ్వాలని అనుకుంటోంది. అయితే కాంగ్రెస్ మాత్రం 64 సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన సీట్లలోనే JMM, RLJP (పశుపతి పరాస్), IP గుప్తా ఇన్‌క్లూసివ్ పార్టీ వంటి చిన్న పార్టీలకు సీట్లను సర్దుబాటు చేయాలన్నది ఆర్జేడీ ప్రతిపాదన. ఇక ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ను అధికారికంగా ప్రకటించాలన్నది వారి డిమాండ్. ఈ విషయంలోనే కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య కాస్త తర్జనభర్జనలు ఉన్నాయి. మరి ఎప్పటికి సమస్యలు పరిష్కారం అవుతాయో వేచి చూడాలి.

మహాఘట్‌బంధన్ సీట్ల కేటాయింపుపై కసరత్తు - Tholi Paluku