
మహిళా సాధికారత నిరంతర ప్రక్రియ
మహిళల ఆధ్వర్యంలోని అభివృద్ధి, బాలల సంక్షేమం 2047 నాటికి వికసిత్ భారత్ దృష్టికోణానికి పునాది అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆదివారం తిరుపతిలో పార్లమెంట్, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీల మొదటి జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు జాతీయ, రాష్ట్ర గీతాలాపన తర్వాత పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు డి. పురందేశ్వరి, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర మహిళా సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్య దేవరలతో కలిసి ఓం బిర్లా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
సభకు ముందు సదస్సు ప్రాంగణానికి చేరుకున్న ఓం బిర్లాకు రాజ్యసభ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, ఉప సభాపతి, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి, రాష్ట్ర మహిళా సంక్షేమ కమిటీ చైర్పర్సన్, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ స్వాగతం పలికారు. ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, పూతలపట్టు, సత్యవేడు, నగరి, వెంకటగిరి ఎమ్మెల్యేలు, తుడా చైర్మన్ ఓం బిర్లాకు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, బీసీ వెల్ఫేర్, చేనేత జౌలి మంత్రి సవిత, స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని ఓం బిర్లాకు పరిచయం చేశారు. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య పుష్పగుచ్ఛాలు అందించారు. వివిధ రాష్ట్రాల కమిటీ సభ్యులతో గ్రూప్ ఫోటో దిగి, ఫోటో ఎక్సిబిషన్ను ప్రారంభించి సభ్యులతో తిలకించారు.
జ్యోతి ప్రజ్వలన తర్వాత ఓం బిర్లా, రాజ్యసభ ఉపాధ్యక్షుడు, ఇతర ప్రముఖులకు శాసనసభ సభాపతి, ఉప సభాపతులు శాలువాలు, శ్రీవారి చిత్రపటాలు బహుకరించారు. లోక్సభ సెక్రటేరియట్ ద్వారా ప్రచురించిన సదస్సు సావనీర్ను ఓం బిర్లా ఆవిష్కరించారు.
ఓం బిర్లా మాట్లాడుతూ, వికసిత్ భారత్కు మహిళా సాధికారత, బాలల సంక్షేమం పునాది అని పేర్కొన్నారు. ‘మన కుమార్తెలు చదువుకొని స్వయం ఆధారితులైతేనే భారతదేశం సమగ్ర అభివృద్ధి సాధిస్తుంది’ అని అన్నారు. ఈ రెండు రోజుల సదస్సు ‘వికసిత్ భారత్ కోసం మహిళా ఆధ్వర్యంలోని అభివృద్ధి’ అనే అంశంతో జరుగుతోందని, జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్, కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు మహిళల సాధికారతపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మహిళల సాధికారత నిరంతర ప్రక్రియని, గ్రామపంచాయతీ నుండి పార్లమెంట్ వరకు మహిళల ప్రాతినిధ్యం పెరగాలని సూచించారు. ‘అమృత్ కాలంలో నారీ శక్తి దేశాన్ని సమగ్ర, శక్తివంతమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది’ అని అన్నారు. మహిళల సమానత్వం, నాయకత్వం, భాగస్వామ్యం సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి పునాది అని స్పష్టం చేశారు.
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగం, ధైర్యం భారత సమాజాన్ని సమానత్వ దిశగా నడిపిందని, రాజ్యాంగ సభలో 15 మంది మహిళలు లింగ సమానత్వానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. గార్గి, అనసూయ వంటి పండితులు, రాణి రుద్రమదేవి, రాణి లక్ష్మీబాయి వంటి యోధులు, నేటి శాస్త్రం, క్రీడలు, సాంకేతిక, రాజకీయ రంగాలలో మహిళల పాత్రను గుర్తుచేశారు. నారీ శక్తి వందన్ అధినియమం చారిత్రక చట్టమని, 20కి పైగా రాష్ట్రాల నుండి నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారని, కమిటీలు అపార్టీ విధానంలో మహిళలు, పిల్లలు చివరి గ్రామం వరకు లబ్ధి పొందేలా చట్టాలు, పథకాలు అమలు చేస్తాయని చెప్పారు.
సదస్సు ప్రారంభానికి ముందు ఓం బిర్లా తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరుపతి భక్తి, త్యాగం, మహిళా కృషికి ప్రతీక కాబట్టి మహిళలు, పిల్లలను అభివృద్ధి పథంలో కేంద్ర స్థానంలో ఉంచడానికి సరైన ప్రదేశమని అన్నారు.
రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు టెక్నాలజీ హబ్లు, స్కిల్ డెవలప్మెంట్లో చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రభుత్వ పథకాల ద్వారా మహిళా స్వశక్తీకరణలో సాధించిన పురోగతిని వివరించారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ కమిటీల సహకారాన్ని అభినందించారు. తిరుపతిలో జరిగిన ఈ సదస్సు మహిళా స్వాశక్తీకరణపై లోతైన చర్చలకు వేదికగా నిలిచిందని, ఆంధ్రప్రదేశ్ స్వాతంత్య్ర సమరయోధులు, సాహితీవేత్తలు, ఆధ్యాత్మిక నాయకులకు శ్రద్ధాంజలి ఘటించారు.
భారత రాజ్యాంగం మహిళల హక్కులకు పునాది వేసిందని, బీహార్లో 50 శాతం మహిళా రిజర్వేషన్ అమలైందని, దేశంలో 41.50 లక్షల మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారని తెలిపారు. ప్రధాని మోదీ పథకాలు – జనధన్ యోజన, ఆవాస్ యోజన, నమో డ్రోన్ దీదీ – మహిళల ఆర్థిక స్వావలంబనలో మైలురాళ్లని, ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ, శ్రీ సిటీ మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు. చట్టాలు మారడం సరిపోదని, సామాజిక అవగాహన పెరగాలని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్నిక దేశానికి ప్రేరణాత్మకమని అన్నారు.
పార్లమెంట్ మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్ పురందేశ్వరి మాట్లాడుతూ, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాల్లో సమానత్వం, సమ్మిళితత్వం, సాధికారత ప్రాముఖ్యతను వివరించారు. విద్య, పారిశ్రామికత, ఆరోగ్యం, డిజిటల్ అక్షరాస్యత ద్వారా మహిళలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, బేటీ బచావో-బేటీ పఢావో, స్టాండప్ ఇండియా, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, జన్ధన్ యోజనల ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో రాణి లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు పాత్రను గుర్తుచేశారు.
ప్రభుత్వం మహిళల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని, విద్య, డిజిటల్ రంగం, ఉద్యోగ అవకాశాలు, నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలని సూచించారు. గృహ హింస, లైంగిక వేధింపుల నిరోధక చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. 1997లో ఏర్పాటైన మహిళా సాధికారత కమిటీ 87 నివేదికలు సమర్పించి, విధానపరమైన మార్పులకు దోహదపడిందని చెప్పారు. ఈ సదస్సు అనుభవాల పంచుకోలు, ఉత్తమ విధానాల మార్పిడి, సవాళ్ల పరిష్కారానికి వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు.
రాష్ట్ర శాసన వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ఈ సదస్సు మహిళలకు సురక్షితత, విద్య, నైపుణ్యాలు, అభివృద్ధిలో సమాన భాగస్వామ్యాన్ని కల్పిస్తుందని, వికసిత్ భారత్–2047, స్వర్ణ ఆంధ్ర–2047 లక్ష్యాలకు ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని అన్నారు. బేటీ బచావో–బేటీ పఢావో, మిషన్ శక్తి, వన్ స్టాప్ సెంటర్స్, మహిళా హెల్ప్లైన్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ వంటి పథకాల ద్వారా మహిళలకు భద్రత, గౌరవం, అభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. స్వర్ణ ఆంధ్ర–2047లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్రం ముందుకు సాగుతోందని, తల్లికి వందనం, దీపం–2, ఉచిత బస్ ప్రయాణం, పెన్షన్లు, ప్రసూతి సాయం వంటి పథకాలు మహిళలకు మేలు చేస్తున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, మహిళలకు సమాన అవకాశాలు, సురక్షిత సమాజం, గౌరవమైన జీవితం కల్పించాలని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే చరిత రెడ్డి, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సేవలను అభినందించారు. స్వాతంత్ర్య సమరం, రాజ్యాంగ నిర్మాణంలో మహిళల కీలక పాత్రను గుర్తుచేశారు. నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సగం భాగం, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారని, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారని చెప్పారు.
రాష్ట్ర మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గౌరు చరితా రెడ్డి స్వాగతోపన్యాసంలో, ఈ సదస్సు మహిళా సాధికారత విధానాలు, కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి, అనుభవాలు పంచుకోవడానికి, సవాళ్లపై చర్చించడానికి వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. 1993లో ఏర్పాటైన కమిటీ మహిళలు, చిన్నారుల సంక్షేమం, హక్కులు, రక్షణ, సాధికారతపై దృష్టి పెట్టిందని, సమగ్ర విధానాలను ప్రోత్సహించి, వనరుల కేటాయింపు, వ్యవస్థల బలోపేతం కోసం పని చేస్తుందని చెప్పారు.
