Let's talk: editor@tmv.in
మహిళా భద్రతకు ప్రథమ ప్రాధాన్యత

మహిళా భద్రతకు ప్రథమ ప్రాధాన్యత

Venkatesh Balusula
18 సెప్టెంబర్, 2025

కృష్ణా జిల్లాలో మహిళా భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని, నేరాల నియంత్రణకు కృషి చేస్తామని నూతన ఎస్పీ విద్యాసాగర్ రావు అన్నారు. బుధవారం ఆయన జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారం, సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పని చేస్తామన్నారు. జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా ఉక్కుపాదం మోపుతామన్నారు. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి

ఇప్పటి వరకు గంగాధర రావు కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. సాధారణ బదిలీల్లో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన విద్యా సాగర్ నాయుడు జిల్లాకు ఎస్పీగా వచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన వెంటనే సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీలు, పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విద్యాసాగర్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని సక్రమంగా విధులు నిర్వహిస్తామన్నారు. జిల్లాను నేర రహితంగా తీర్చిదిద్దేందుకు సిబ్బందిని ఎల్లవేళలా అప్రమత్తం చేస్తూ, సిబ్బంది సమస్యల పరిష్కారంలో కూడా ముందుంటానని హామీ ఇచ్చారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

మహిళా భద్రతకు ప్రథమ ప్రాధాన్యత - Tholi Paluku