
మహిళా ఖైదీలకు ప్రత్యేక భోజనం
జైలులో ఉన్న మహిళా ఖైదీలకు పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు. బుధవారం ఉదయం ఆమె విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముందుగా జైలులోని మహిళా బ్యారేక్‌ను పరిశీలించిన ఆమె వారికి అందుతున్న వసతులపై సమగ్రంగా పరిశీలన చేశారు. తరువాత మహిళలకు అందుతున్న భోజన సౌకర్యాలను పరిశీలించి ఆహారం రుచి చూసిన శైలజ, సంతృప్తి వ్యక్తం చేశారు. జైలులో మహిళల జీవనశైలి, వారికి అందిస్తున్న కార్యక్రమాలు, హాస్పిటల్, బేకరీ, ఫ్యాక్టరీల పనితీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు నవరాత్రి సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ తరఫున పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పోషమ్మ పథకం అమలు చేస్తున్నదని, మహిళా ఖైదీలకు కూడా ‘పోషమ్మ’ పథకం కింద ప్రత్యేక డైట్ ప్లాన్ అమలు చేయాలని పరిశీలిస్తున్నామని వివరించారు. “ప్రస్తుతం జైలులో 80 మంది మహిళలు ఉన్నారని, వీరిలో 50 మంది గంజాయి అక్రమ రవాణా కేసుల్లో అరెస్టయిన వారు ఉన్నారన్నారు. ఒడిశా, చెన్నై ప్రాంతాలకు చెందిన మహిళలు కూడా ఉన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో మత్తు పదార్థాల రవాణా కేసుల్లో జైలు పాలవుతున్నారు. ఇలాంటి వారికి అవగాహన కల్పించి, స్వశక్తితో బతికేలా చర్యలు చేపడతాం” అని శైలజ స్పష్టం చేశారు. వీరికి కౌన్సిలింగ్ ఇప్పించి తిరిగి సమాజంలో గౌరవ ప్రదంగా జీవించే విధంగా చేయాలని కృషి చేస్తున్నామన్నారు.ఇటీవల ప్రసవమైన మహిళా ఖైదీ బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని లాలించారు. జైలులో ఉన్న మహిళా ఖైదీలకు ఐసిడిఎస్ ద్వారా పౌష్టికాహారం అందించే విధానంపై కూడా పరిశీలన జరుగుతోందని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ జాయింట్ డైరెక్టర్ చిన్మయి దేవి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామలక్ష్మి, ఇతర ఐసిడిఎస్, సెంట్రల్ జైలు సిబ్బంది పాల్గొన్నారు.
