
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం: మంత్రి సీతక్క
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు మహారాణులుగా ఉండాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. గతంలో మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారని, మగవారి ఆదాయంపైనే ఆధారపడేవారన్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్ర మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకువచ్చిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు.
అలాగే మహాలక్ష్మి పథకం, వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు, ఇందిరా మహిళా శక్తి పథకం, మహిళలకు కుట్టుమిషన్, మహిళ సంఘాలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. వ్యాపారం చేయాలనుకునే మహిళలకు, మహిళ సంఘాల ద్వారా రుణాలు అందించామని తెలిపారు. ప్రభుత్వం మహిళల ఆర్థికంగా వివిధ రంగాలలో స్థిరపడే విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకాలు మహిళలను, సామాజికంగా, ఆర్థికంగా బలమైనవారిగా తీర్చిదిద్దేందుకు మార్గాన్ని చూపుతాయన్నారు. రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తుంటే బీఆర్ఎస్ ఈ పథకాన్ని అగౌరవపరుస్తూ మహిళలపై విమర్శలు చేస్తున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు
