Let's talk: editor@tmv.in
మహిళను హత్య చేసి.. మూటలో కుక్కి!

మహిళను హత్య చేసి.. మూటలో కుక్కి!

Panthagani Anusha
21 సెప్టెంబర్, 2025

నగర శివారులోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. తీవ్ర దుర్వాసన వెలువడుతున్న ఓ మూటను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దుర్వాసన వస్తున్న మూటను తెరిచి చూడగా అందులో ఒక మహిళ మృతదేహం లభ్యం కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రమీలగా గుర్తించారు. గత కొంతకాలంగా ఆమె కొండాపూర్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నట్లు తెలిసింది. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం మృతురాలు తనకు పరిచయస్తుడైన ఒక బెంగాలీ యువకుడితో సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. వ్యక్తిగత వివాదాల కారణంగా నిందితుడు ప్రమీలను హత్య చేసి, మృతదేహాన్ని మూటలో కుక్కి రైల్వే స్టేషన్ సమీపంలో పారవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కేసును ఛేదించడానికి పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మృతదేహాన్ని రైల్వే స్టేషన్ కి తీసుకొచ్చి ఎవరికి అనుమానం రాకుండా ఒక చోట పెట్టి, స్టేషన్ వెయిటింగ్ హాల్‌లో దుస్తులు మార్చుకొని అస్సాం పారిపోయినట్లు గుర్తించారు. దీంతో నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాలు, టెలీకాం రికార్డులు, స్థానికుల సమాచారం ఈ దర్యాప్తులో కీలకం ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనతో రైల్వే ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి అనుమానాస్పద పరిస్థితులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు. నిందితుడిని త్వరగా అదుపులోకి తీసుకొని న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు.

మహిళను హత్య చేసి.. మూటలో కుక్కి! - Tholi Paluku