
మహబూబ్ నగర్ జిల్లాలో భూమి పెడ్నేకర్ పర్యటన
ప్రపంచ జల దినోత్సవం (మార్చి 22) సందర్భంగా ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త భూమి పెడ్నేకర్ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, మడ్గుల్ మండలం, కొల్కులపల్లి గ్రామంలోని కమ్యూనిటీ ప్యూర్ వాటర్ శుద్దీకరణ కేంద్రాన్ని సందర్శించారు. గ్రామీణ భారతదేశంలో సురక్షితమైన, స్థిరమైన తాగునీటి అవశ్యకతను ఈ సందర్భంగా ఆమె నొక్కి చెప్పారు.
భారతదేశంలో నీటి సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతోంది. వాతావరణ మార్పులు, భూగర్భ జలాల తగ్గుదల, పెరుగుతున్న అవసరాల కారణంగా సమస్య మరింత పెరిగింది. దేశంలోని దాదాపు 70 శాతం త్రాగునీరు కాలుష్యానికి గురైందని అంచనా. అలాగే నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల వల్ల ప్రతి రోజు 800కు పైగా పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సురక్షితమైన తాగునీరు అందించడం ప్రజల ఆరోగ్యం, గౌరవం, అభివృద్ధికి అత్యంత కీలకం.
సందర్శన సందర్భంగా భూమి పెడ్నేకర్ గ్రామస్తులతో, ముఖ్యంగా మహిళలు, పాఠశాల విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. శుద్ధి చేసిన నీరు అందుబాటులోకి రావడంతో నీటి కోసం ఖర్చయ్యే సమయం తగ్గిందని, ఆరోగ్యం మెరుగుపడిందని, విద్య, ఉపాధి అవకాశాలు పెరిగాయని వారు వివరించారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థ స్థాపకుడు రవి రెడ్డి మాట్లాడుతూ, తమ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా 600కు పైగా కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 15 లక్షల మందికి సురక్షితమైన నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. వారి 'ఎనీ టైమ్ వాటర్' సిస్టమ్ ద్వారా 24/7 నీరు అందుబాటులో ఉంటుందని వివరించారు. సురక్షితమైన తాగునీరు అనేది దాతృత్వం కాదని, అది ఒక ప్రాథమిక హక్కు, అత్యవసర ప్రజారోగ్య మౌలిక సదుపాయం అని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ, సురక్షితమైన తాగునీరు ప్రతి ఒక్కరి హక్కు. కానీ ఇంకా లక్షలాది మంది దీనికి దూరంగా ఉన్నారు. కమ్యూనిటీ ప్యూర్ వాటర్ చేస్తున్న పని ఆరోగ్యం, గౌరవం, అవకాశాలను తిరిగి అందిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే సమిష్టి కృషి అవసరం అని తెలిపారు.
అదనంగా, సమీప ప్రభుత్వ పాఠశాలను కూడా భూమి సందర్శించారు. అక్కడ శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థుల ఆరోగ్యం, చదువు మెరుగుపడుతున్నట్లు ఆమె గమనించారు. కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక, స్థిరమైన నీటి పరిష్కారాలను అందిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. ఈ సందర్శన ద్వారా గ్రామీణ భారతదేశం ఎదుర్కొంటున్న నీటి సమస్యలపై జాతీయ స్థాయిలో దృష్టి ఆకర్షించబడింది. ఈ కార్యక్రమంలో సీపీడబ్ల్యూ ప్రతినిధులు ప్రతీక్ష ప్రశాంత్, సుమీత్ రావాలా, లక్ష్మి కొనమనేని తదితరులు పాల్గొన్నారు.
