Let's talk: editor@tmv.in
మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగుచూసిన బృహత్ శిలాయుగపు 'డాల్మెన్'

మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగుచూసిన బృహత్ శిలాయుగపు 'డాల్మెన్'

Dantu Vijaya Lakshmi Prasanna
20 ఫిబ్రవరి, 2026

మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్, బిజినేపల్లి మండలాల సరిహద్దు ప్రాంతంలో వేల ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లు బయల్పడ్డాయి. బృహత్ శిలాయుగానికి చెందిన ఒక అరుదైన 'డాల్మెన్' (శిలా సమాధి)ను సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, హిస్టరీ, కల్చర్ అండ్ టూరిజం విభాగానికి చెందిన విద్యార్థిని మనీషా గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశోధనలో భాగంగా ఆమె ఈ పురాతన కట్టడాన్ని కనుగొని, దీనికి సంబంధించిన వివరాలను విశ్వ విద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం ఏ శ్రీనివాసన్ కి వెల్లడించారు.

ఈ డాల్మెన్ నిర్మాణం ప్రాచీన మానవుల జీవనశైలికి, వారి అంత్యక్రియల సంప్రదాయాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. పెద్ద పెద్ద రాళ్లను నిలువుగా ఉంచి, వాటిపై ఒక భారీ శిలను కప్పుగా ఉంచిన ఈ నిర్మాణం పరిశోధకులను ఆకర్షిస్తోంది. సాధారణంగా ఇవి క్రీస్తుపూర్వం 1000 నుండి 500 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవిగా చరిత్రకారులు భావిస్తుంటారని ప్రొఫెసర్ డా. ఎం ఏ శ్రీనివాసన్ తెలిపారు.

ఈ బృహత్ శిలాయుగపు సమాధి ఆర్కియాలజీ శాఖ గాని, పరిశోధకులు గానీ ఇంతకుముందే రికార్డు చేసిందో లేదో తెలుసుకోవాల్సి ఉందని శ్రీనివాసన్ అన్నారు. ఇటువంటి మెగాలిథిక్ బరియల్స్ తెలంగాణలో విస్తృతంగా ఉన్నాయని కనీసం మెజారిటీ వాటిని మనం కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలుగు విశ్వవిద్యాలయ విద్యార్థిని మనీషా చేసిన ఈ ఆవిష్కరణ పట్ల చరిత్రకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని పరిశోధనలు చేస్తే మరిన్ని చారిత్రక రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పురాతన కట్టడాన్ని ప్రభుత్వం సంరక్షించి, భావి తరాలకు అందించాలని పురావస్తు ప్రేమికులు, చరిత్ర ఔత్సాహికుల కోరుతున్నారు.