
మోహన్ లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
మళయాల విలక్షణ నటుడు సూపర్ స్టార్ మోహన్ లాల్ కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును శనివారం ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డు మోహన్ లాల్ ను వరించింది. భారతీయ సినిమా రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సంబంధిత శాఖ తెలిపింది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన సినీ రంగానికి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేసింది. ఈ నెల 23న ఆయనకు 71వ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోనున్నారు.
మోహన్ లాల్ తన అద్భుతమైన నటనతో ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఈయన దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించారు. ఇప్పటి వరకు జాతీయ, కేరళ ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, సైమా ఇలా ఎన్నో అవార్డులు ఆయన సొంతమయ్యాయి. దాదా సాహెబ్ తో తన నటనకు దక్కిన గౌరవంగా చెప్పవచ్చు. ఇటీవల ఆయన నటించిన ‘తుడరమ్’ బ్రహ్మండమైన విజయాన్ని అందుకుంది.
ఈ ప్రకటన తర్వాత సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మోహన్‌లాల్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీ మోహన్‌లాల్‌ను అభినందించారు. మోహన్‌లాల్ వైవిధ్యతకు చిహ్నమని, దశాబ్దాలుగా మలయాళ సినిమాకు సేవలందించారని కొనియాడారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా అద్భుత పాత్రలు పోషించారన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా మోహన్‌లాల్‌ను అభినందించారు. నటుడు మమ్మూట్టి, మోహన్‌బాబు, పవన్ కళ్యాణ్, రామ్ గోపాల్ వర్మ సహా ఇతర సినీ ప్రముఖులు, అభిమానులు కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.
