
మెస్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి
రాష్ట్రంలోని ఎస్సీ హాస్టళ్లకు సంబంధించి మెస్ బిల్లులు, కూరగాయల బిల్లులు తక్షణమే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం గత 16 నెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న హాస్టళ్లకు సంబంధించి సుమారు రూ.వంద కోట్ల మేర బకాయిలు తక్షణమే విడుదల చేయాలన్నారు. ముఖ్యంగా మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో హాస్టళ్లలో ఆహార కొరత ఏర్పడిందన్నారు.
వార్డెన్లు కూరగాయలు, నిత్యావసరాలు కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, దీంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించలేకపోతున్నారని చెప్పారు. ఈ బకాయిల నేపథ్యంలో చాలాచోట్ల హాస్టళ్లలో పౌష్టికాహారం అందించడంలో అంతరాయం ఏర్పడిందని. తగిన నిధులు లేకపోవడం వల్ల కాంట్రాక్టర్లు సరఫరా ఆపేస్తున్నారని, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కృష్ణయ్య పేర్కొన్నారు. విద్యార్థుల చదువు మీద ఇది ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నదని, ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎస్సీ హాస్టల్స్ మెస్ బిల్లులు విడుదల చేయకపోతే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
