
మస్కట్‌లో ఇరాన్-అమెరికా 'అణు' చర్చలు
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్, అమెరికా మధ్య అణు అంశంపై కీలక చర్చలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఒమన్ రాజధాని మస్కట్‌లో ఇరాన్-అమెరికా మధ్య అణు చర్చలు జరగనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, “అమెరికాతో అణు చర్చలు మస్కట్‌లో జరగనున్నాయి. అవసరమైన ఏర్పాట్లు చేసిన ఒమన్ సోదరులకు కృతజ్ఞతలు” అని తెలిపారు.
ఇరాన్ అభ్యర్థన మేరకు ఈ చర్చల వేదికను ఇస్తాంబుల్ నుంచి మస్కట్‌కు మార్చినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ‘ప్రెస్ టీవీ’ వెల్లడించింది. ఈ చర్చలు పూర్తిగా పరోక్ష విధానంలో సాగనున్నాయని, ఒమన్ మధ్యవర్తిగా వ్యవహరించనుందని తెలిపింది.
అణు అంశాలకే పరిమితం
ఈ చర్చలు పూర్తిగా ఇరాన్ శాంతియుత అణు విద్యుత్ కార్యక్రమం, అలాగే అమెరికా విధించిన ఆంక్షల తొలగింపుపైనే ఉంటాయని ఇరాన్ స్పష్టం చేసింది. క్షిపణి కార్యక్రమం, ప్రాంతీయ రాజకీయాలు వంటి ఇతర అంశాలపై చర్చకు ఎలాంటి అవకాశం లేదని టెహ్రాన్ మరోసారి తేల్చిచెప్పింది. ఇది తమ దీర్ఘకాలిక విధానమని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు.
ఈ చర్చల్లో ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అరాఘ్చీ నేతృత్వం వహించనున్నారు. ఆయనతో పాటు సీనియర్ దౌత్యవేత్తలు మజీద్ తక్త్-రవాంచీ, కాజెం ఘరీబాబాది పాల్గొననున్నారు. అమెరికా తరఫున వైట్ హౌస్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ హాజరవుతారని సమాచారం.
యుద్ధంతో ఆగిపోయిన చర్చలు
గత ఏడాది అరాఘ్చీ, విట్‌కాఫ్ నేతృత్వంలో ఐదు దఫాల అణు చర్చలు జరిగాయి. అయితే ఆరో దఫా చర్చలకు రెండు రోజుల ముందు ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ యుద్ధంలో తరువాత అమెరికా కూడా చేరిందని ఇరాన్ ఆరోపించింది. ఈ ఘర్షణల్లో వెయ్యికి పైగా మంది మరణించారని, పౌర, సైనిక, శాస్త్రీయ సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లిందని ఇరాన్ మీడియా పేర్కొంది.
బెదిరింపులేని వాతావరణమే కావాలి
అమెరికాతో చర్చలు విజయవంతం కావాలంటే బెదిరింపులు, అన్యాయమైన డిమాండ్లు లేకుండా గౌరవప్రదమైన వాతావరణం ఉండాలని ఇరాన్ నేతలు స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ సలహాదారు అలీ షామ్‌ఖానీ కూడా చర్చల్లో వాస్తవికత, పరస్పర గౌరవం అత్యవసరమని వ్యాఖ్యానించారు.
అమెరికా స్పందన
ఈ నేపథ్యంలో అమెరికా కూడా చర్చలకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ, “ఇరాన్‌తో మాట్లాడటాన్ని మేం లొంగుబాటు లేదా ఆ ప్రభుత్వానికి చట్టబద్ధత ఇచ్చినట్లుగా చూడం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధమే” అన్నారు.
అయితే, అర్థవంతమైన చర్చలు జరగాలంటే ఇరాన్ అణు కార్యక్రమంతో పాటు క్షిపణి కార్యక్రమం, ఉగ్రవాద సంస్థలకు మద్దతు, ఇరాన్‌లో ప్రజలపై జరుగుతున్న అణచివేత వంటి అంశాలపై కూడా చర్చ జరగాలని రూబియో స్పష్టం చేశారు. ఇరాన్‌లో ఇటీవల జరిగిన ఆర్థిక నిరసనలపై స్పందిస్తూ, దేశ వనరులను ప్రజల సంక్షేమానికి కాకుండా ఉగ్రవాదానికి ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రజలు కోరేది వేరు… పాలకుల దారే వేరు: రూబియో
ఇరాన్‌కు గొప్ప సాంస్కృతిక చరిత్ర ఉందని, అయితే అక్కడి మతాధారిత పాలకులు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించట్లేదని రూబియో వ్యాఖ్యానించారు. “ప్రజలు కోరేది వేరు… పాలకుల దారే వేరు” అంటూ విమర్శించారు. ఇరాన్ మాట్లాడాలనుకుంటే అమెరికా సిద్ధమేనని, ఒప్పందం కుదరుతుందో లేదో తెలియదని, అయినా ప్రయత్నంలో తప్పేమీ లేదని రూబియో చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడూ శాంతియుత పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు.
ఉద్రిక్తతల నడుమ చర్చలు
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు, అమెరికా సైనిక ఉనికి పెరుగుతున్న వేళ ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జనవరిలో అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికల అనంతరం ఇరాన్‌లో భద్రతా ఘటనలు చోటుచేసుకున్నాయని, ఇవి దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలేనని ఇరాన్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం తమ సైనిక సన్నద్ధత యుద్ధానికి పూర్వం కంటే మెరుగైన స్థాయికి చేరుకుందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మస్కట్ చర్చలు ఇరాన్–అమెరికా సంబంధాల్లో కీలక మలుపు అవుతాయా? లేదా భిన్న అజెండాల మధ్య మళ్లీ నిలిచిపోతాయా? అన్నది వేచి చూడాల్సిందే.
