Let's talk: editor@tmv.in
మస్కట్‌కు తొలి స్వదేశీ పడవ ‘ఐఎన్ఎస్వీ–కౌండిన్య’

మస్కట్‌కు తొలి స్వదేశీ పడవ ‘ఐఎన్ఎస్వీ–కౌండిన్య’

Pinjari Chand
30 డిసెంబర్, 2025

భారత నౌకాదళానికి చెందిన స్వదేశీంగా నిర్మితమైన సాంప్రదాయంగా తయారు చేసిన పడవ ఐఎన్ఎస్వీ కౌండిన్య తన తొలి విదేశీ సముద్ర ప్రయాణాన్ని గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్ దిశగా సోమవారం (డిసెంబర్ 29న) ప్రారంభించింది. ఈ చారిత్రాత్మక ప్రయాణం ద్వారా భారతదేశపు ప్రాచీన సముద్ర వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసే దిశగా మరో కీలక అడుగు పడింది. ఈ నౌకను పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారతదేశంలో ఒమన్ రాయబారి ఇస్సా సాలెహ్ అల్ షిబానీ, భారత నౌకాదళ ఉన్నతాధికారులు, ప్రముఖ అతిథులు పాల్గొన్నారు.

ప్రాచీన సాంకేతికతతో నిర్మితమైన నౌక

ఐఎన్ఎస్వీ కౌండిన్యను శతాబ్దాల క్రితం భారతదేశంలో ఉపయోగించిన సాంప్రదాయ ‘స్టిచ్డ్ షిప్ బిల్డింగ్’ పద్ధతితో, సహజ పదార్థాలను ఉపయోగించి నిర్మించారు. చారిత్రక ఆధారాలు, శిల్ప కళా సాక్ష్యాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ నౌక భారతదేశపు స్వదేశీ నౌక నిర్మాణ నైపుణ్యం, నావిగేషన్, సముద్ర నావిగేషన్ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

ప్రాచీన వాణిజ్య మార్గాల పునరావిష్కరణ

ఈ ప్రయాణం ద్వారా గుజరాత్ తీరాన్ని ఒమన్‌తో అనుసంధానించిన ప్రాచీన సముద్ర వాణిజ్య మార్గాలను తిరిగి అనుసరిస్తున్నారు. ఒకప్పుడు ఈ మార్గాలు వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడులు, నాగరిక సంబంధాలకు కేంద్రబిందువులుగా ఉండేవి.

భారత్–ఒమన్ సంబంధాలకు బలమిచ్చే ప్రయాణం

ఐఎన్ఎస్వీ కౌండిన్య మస్కట్ చేరడం భారత్–ఒమన్ మధ్య ఉన్న శతాబ్దాల నాటి స్నేహబంధానికి ప్రతీకగా నిలవనుంది. ఈ యాత్ర ద్వారా రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ప్రజా సంబంధాలు మరింత బలపడతాయని నౌకాదళం అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా గుజరాత్–ఒమన్ మధ్య ఉన్న చారిత్రక అనుబంధాన్ని ఈ ప్రయాణం మరింత వెలుగులోకి తీసుకొస్తోంది. ఈ యాత్ర ద్వారా భారత నౌకాదళం మారిటైమ్ డిప్లమసీ, చారిత్రక వారసత్వ పరిరక్షణ, ప్రాంతీయ సహకారంపై తన నిబద్ధతను స్పష్టంగా చాటుతోంది. భారతదేశం ఒక బాధ్యతాయుతమైన, సాంస్కృతిక మూలాలతో బలపడిన సముద్ర దేశంగా భారత మహాసముద్ర ప్రాంతంలో పోషిస్తున్న పాత్రకు ఇది నిదర్శనం.

నౌకా సిబ్బంది వివరాలు

కమాండర్ వికాస్ షెరాన్ – నౌకాధిపతి

కమాండర్ వై. హేమంత్ కుమార్ – యాత్ర ఇన్‌చార్జ్ (ప్రాజెక్ట్ ఆరంభం నుంచి అనుబంధం)

సిబ్బంది: 4 అధికారులు, 13 నౌకాదళ సెయిలర్లు

భారత సముద్ర సంప్రదాయాలకు ఇది అద్భుత ప్రతీక:ప్రధాని మోడీ

భారత నౌకాదళానికి చెందిన స్వదేశీ సాంప్రదాయ పడవ ఐఎన్ఎస్వీ కౌండిన్య గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్ దిశగా తన తొలి విదేశీ సముద్రయాత్రను ప్రారంభించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ యాత్ర భారతదేశపు ప్రాచీన సముద్ర వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. ఐఎన్ఎస్వీ కౌండిన్యను ప్రాచీన భారతీయ ‘స్టిచ్డ్-షిప్’ (కుట్టిన పడవ) నిర్మాణ పద్ధతితో రూపొందించడాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ నౌక భారతదేశపు గొప్ప సముద్ర సంప్రదాయాలకు, నౌకా నిర్మాణ నైపుణ్యానికి అద్దం పడుతుందని ఆయన అన్నారు. ఈ వినూత్న నౌకను రూపొందించిన డిజైనర్లు, శిల్పకారులు, నౌకా నిర్మాణ కార్మికులు, భారత నౌకాదళం అందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు.