Let's talk: editor@tmv.in
మోసాల పుట్టగా మారిన డిజిటల్ ప్రపంచం

మోసాల పుట్టగా మారిన డిజిటల్ ప్రపంచం

T Venkata Ramana
24 సెప్టెంబర్, 2025

అత్యాధునిక సాంకేతికత సైబర్ నేరగాళ్లకు అస్త్రంగా మారింది. గతంలో ఎప్పుడూ చూడని కొత్త తరహా మోసాలతో అపరిచితులు మన జీవితాల్లోకి ప్రవేశించి కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. కేవలం భయం ఆశ అనే రెండు బలహీనతలను ఆసరాగా చేసుకుని లక్షల కోట్లు కొల్లగొడుతున్న ఈ సైబర్ మాఫియా ఇప్పుడు మన రాష్ట్రంలో పెను సవాలుగా మారింది. ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లోనే తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా రూ. 606 కోట్ల రూపాయలను సైబర్ కేటుగాళ్లు దోచుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పోలీసు రికార్డుల ప్రకారం ఈ మోసాలకు బలైపోయిన బాధితుల సంఖ్య 14,739 అయితే, పరువు పోతుందనో, న్యాయం జరగదనే భయంతోనో ఫిర్యాదు చేయనివారి సంఖ్య దీనికి కొన్ని రెట్లు అధికంగా ఉంటుందని అంచనా. ఈ సైబర్ మాయాజాలంలో చిక్కుకుని, కష్టార్జితాన్ని కోల్పోయినవారిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, గృహిణులే ఎక్కువగా ఉండటం గమనార్హం.

సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడలు

సైబర్ నేరగాళ్లు పాత మోసాలైన ఓటీపీ అడిగి డబ్బులు దోచుకునే పద్ధతులను దాటి మన బలహీనతలను లక్ష్యంగా చేసుకుని కొత్త వలలు వేస్తున్నారు. ఆకర్షణీయమైన పేర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా గ్రూపులను సృష్టిస్తారు. 'వర్క్ ఫ్రమ్ హోమ్', 'సులువుగా డబ్బు సంపాదన వంటి ప్రకటనలతో ప్రజలను ఆకర్షిస్తారు. మొదట చిన్న చిన్న టాస్క్‌లు ఇచ్చి, ఉదాహరణకు యూట్యూబ్ వీడియోలకు లైక్ చేయడం, గూగుల్ రివ్యూలు ఇవ్వడం వంటివి చేయించి తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తారు. బాధితులకు నమ్మకం కలిగిన తర్వాత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టించి ఉన్నదంతా దోచుకుంటారు.

నకిలీ ట్రేడింగ్ యాప్‌ల మోసం

ట్రేడింగ్, పెట్టుబడి పేరుతో ఒక నకిలీ వెబ్‌సైట్, యాప్‌ను సృష్టిస్తారు. తొలుత చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తారు. పెట్టిన గంటల్లోనే ఆ మొత్తం రెట్టింపు అయినట్లు నకిలీ యాప్‌లో చూపిస్తారు. కొంత డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. దీంతో పూర్తిగా నమ్మకం కలిగిన తర్వాత లక్షల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తారు. ఆ తర్వాత యాప్ పనిచేయదు డబ్బులు మాయమవుతాయి.

డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు

ఇది అత్యంత భయంకరమైన మోసం. కస్టమ్స్, పోలీస్, సీబీఐ అధికారులమంటూ ఫోన్ చేసి బెదిరిస్తారు. "మీ ఆధార్‌ కార్డుపై అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయి", "మీ పేరు మీద డ్రగ్స్ పార్శిల్ వచ్చింది" అంటూ భయపెడతారు. నకిలీ ఐడీ కార్డులు అరెస్ట్ వారెంట్లు చూపించి కేసు నుంచి బయటపడాలంటే తమకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. భయపడిన బాధితులు లక్షలాది రూపాయలు వాళ్ళు చెప్పిన అకౌంట్లలో జమ చేస్తారు. వివిధ రకాలైన ఫిషింగ్ వెబ్‌సైట్‌లు, లింకులతో బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు సేకరించి ఖాతాలోని డబ్బును ఖాళీ చేస్తున్నారు.

నమ్మకం కలిగించి

గ్రూపులో చేర్చిన తర్వాత కొంతమంది నకిలీ సభ్యులు తాము లక్షలు సంపాదించామని, తమ జీవితాలే మారిపోయాయని స్క్రీన్‌షాట్‌లు పెడుతుంటారు. ఇది చూసి గ్రూపులోని మిగతా సభ్యులకు ఆశ పుడుతుంది. తర్వాత వ్యక్తిగతంగా చాటింగ్ మొదలుపెట్టి మాయమాటలతో నమ్మిస్తారు.

ఎర వేయడం

ట్రేడింగ్, పెట్టుబడి పేరుతో ఒక నకిలీ యాప్, వెబ్‌సైట్ లింకును పంపిస్తారు. తొలుత వెయ్యి, అయిదువేలు వంటి చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టమంటారు. పెట్టిన గంటల్లోనే ఆ మొత్తం రెట్టింపు అయినట్లు నకిలీ యాప్‌లో చూపిస్తారు. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. దీంతో బాధితులకు పూర్తి నమ్మకం కలుగుతుంది.

టాస్క్‌ల మాయ

మరికొన్ని ముఠాలు బహుళజాతి కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని యూట్యూబ్ వీడియోలను లైక్ చేయాలని, గూగుల్ రివ్యూలు ఇవ్వాలని టాస్క్‌లు ఇస్తాయి. ఒక్కో స్క్రీన్‌షాట్‌కు రూ.100 నుంచి రూ.200 ఇస్తామని నమ్మిస్తాయి. మొదట్లో డబ్బులు చెల్లించి ఆ తర్వాత పెద్ద టాస్క్ పేరుతో లక్షల్లో పెట్టుబడులు పెట్టించి ఉన్నదంతా ఊడ్చేస్తాయి.

రికవరీలో సవాళ్లు

సైబర్ నేరాలను అరికట్టడం పోలీసు వ్యవస్థకు ఒక పెద్ద సవాలుగా మారింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గణాంకాల ప్రకారం సైబర్ క్రైమ్ కేసులు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 20 వేలరే పైగా కేసులు వివిధ దశల్లో దర్యాప్తులో ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు దేశంలోని మారుమూల ప్రాంతాలైన జామ్తారా, మేవాత్, కోల్‌కతా వంటి ప్రాంతాల నుంచి, కొన్నిసార్లు దుబాయ్, కంబోడియా వంటి విదేశాల నుంచి కూడా తమ కార్యకలాపాలు సాగిస్తుండటంతో దర్యాప్తు క్లిష్టంగా మారుతోంది.

అరెస్టులు, రికవరీ

ఈ ఏడాది పోలీసులు వందలాది మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. ఇటీవల హైదరాబాద్ పోలీసులు గుజరాత్‌లో ఒక ఆపరేషన్ నిర్వహించి 36 మందిని పట్టుకున్నారు. అయితే పోయిన సొమ్ములో రికవరీ శాతం చాలా తక్కువగా ఉంది. బాధితులు కోల్పోయిన రూ. 606 కోట్లలో పోలీసులు ఇప్పటి వరకు కేవలం 15 శాతం నుంచి 18 శాతం వరకు మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. ఫిర్యాదులు ఆలస్యంగా అందడమే దీనికి ప్రధాన కారణం.

ప్రజలేం చేయాలి?

సైబర్ నేరాల బారిన పడకుండా ఉండటానికి ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సందేహాస్పద లింకులను క్లిక్ చేయవద్దు. వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్సెమ్మెస్‌లలో వచ్చే గుర్తుతెలియని లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవవద్దు. ఆకర్షణీయమైన ఆఫర్‌లను చూసి మోసపోవద్దు. సులువుగా వచ్చే డబ్బును నమ్మవద్దు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని చెప్పేవారిని నమ్మవద్దు. ట్రేడింగ్, టాస్క్‌ల పేరుతో వచ్చే ఆఫర్లకు దూరంగా ఉండాలి.

ధృవీకరించుకోవాలి

పోలీసులు, ప్రభుత్వ సంస్థల పేరుతో ఫోన్లు వస్తే భయపడకుండా వెంటనే కాల్ కట్ చేసి నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి విషయాన్ని ధృవీకరించుకోవాలి. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్‌లో విచారణ జరిపి డబ్బులు డిమాండ్ చేయదు.

గోల్డెన్ అవర్ కీలకం

ఒకవేళ మీరు మోసపోయి డబ్బు కోల్పోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలి. మొదటి గంటలో ఫిర్యాదు చేస్తే నేరగాళ్ల ఖాతాలోని డబ్బును ఫ్రీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డిజిటల్ ప్రపంచంలో మన ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. అత్యాశ, భయం అనే రెండు బలహీనతలను ఆసరా చేసుకునే ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. వారి మోసాల గురించి తెలుసుకోవడం ఇతరులకు చెప్పడం ద్వారా ఈ నేరాలను అరికట్టడంలో మన వంతు కృషి చేయవచ్చు.

మోసాల పుట్టగా మారిన డిజిటల్ ప్రపంచం - Tholi Paluku