
మైసూరు దసరా ఉత్సవాలకు భాను ముస్తాక్
కర్ణాటకలోని మైసూర్ దసరా ఉత్సవాలు దేశంలోనే ప్రసిద్ధి చెందినవి. ఈ ఉత్సవాల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఒక ప్రఖ్యాత వ్యక్తిని ఆహ్వానిస్తుంది. ఈసారి కర్ణాటక ప్రభుత్వం ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్ గ్రహీత భాను ముస్తాక్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. కాగా ఈ నిర్ణయం రాష్ట్రంలో ఒక పెద్ద రాజకీయ, మతపరమైన వివాదానికి దారితీసింది. హిందూ సంస్థలు, బీజేపీ వంటి కొన్ని రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.
భాను ముస్తాక్ ఆహ్వానాన్ని సవాల్ చేస్తూ పలువురు కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మైసూరు దసరా ఉత్సవాలు మతపరమైన వేడుకలు అని, వీటిని హిందూయేతరులు ప్రారంభించడం సంప్రదాయానికి విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. ముఖ్యంగా దసరా ప్రారంభోత్సవంలో భాగంగా చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు, సంప్రదాయ ఆచారాలు ఉంటాయని, వీటిలో హిందూయేతరులు పాల్గొనడం సరైనది కాదని ఆరోపించారు. భాను ముస్తాక్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు హిందూ మతానికి, కన్నడ సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. దసరా ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ, అవి ప్రధానంగా మతపరమైన కార్యక్రమాలని, వాటిని పూర్తిగా లౌకిక వేడుకలుగా చూడలేమని పిటిషనర్లు కోర్టులో వాదించారు. కాబట్టి భాను ముస్తాక్‌కు ఆహ్వానాన్ని రద్దు చేసుకునేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
హైకోర్టు తీర్పు
అయితే ఈ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దసరా ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు అని, వాటికి ఒక నిర్దిష్ట మతం వ్యక్తిని ఆహ్వానించడం రాజ్యాంగ విరుద్ధం కాదని పేర్కొంది. ఒక వ్యక్తి తన మత విశ్వాసాలతో సంబంధం లేకుండా మరొక మతపరమైన పండుగలో పాల్గొనడం లేదా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించదని హైకోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో సవాల్
దాంతో పిటిషనర్లు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఆలయంలో జరిగే పూజ పూర్తిగా మతపరమైన ఆచారం అని, దీనిలో హిందూయేతరులు పాల్గొనడం మత విశ్వాసాలకు విరుద్ధమని వాదించారు. ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు సైతం ఈ అప్పీళ్లను కొట్టివేసింది. భాను ముస్తాక్‌ను దసరా ఉత్సవాలకు ఆహ్వానించడం ప్రజల చట్టపరమైన హక్కులకు గానీ, రాజ్యాంగపరమైన హక్కులకు గానీ భంగం కలిగించదని వ్యాఖ్యానించింది. '2017లో కన్నడ రచయిత నిసార్ అహ్మద్ ఈ ఉత్సవాలను ప్రారంభించినప్పుడు ఎందుకు పిటిషన్ వేయలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు ఈ పిటిషన్ వేశారు?' అని ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది. ఒక లౌకిక దేశంలో ప్రభుత్వం మతాల ఆధారంగా వ్యక్తుల మధ్య వివక్ష చూపలేదని స్పష్టం చేసింది. దసరా ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం అని, ఇది ఒక ప్రైవేట్ వేడుక కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం ఏ వ్యక్తిని అయినా, వారి నేపథ్యం లేదా మతంతో సంబంధం లేకుండా ఆహ్వానించే హక్కు ఉందని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు భారతదేశంలోని లౌకికవాద సూత్రాలను మరోసారి పునరుద్ఘాటించింది. మతపరమైన ఉత్సవాలు ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగినప్పుడు, వాటికి సమాజంలో వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఈ తీర్పు భారత రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తిని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను సమర్థించింది. ఈ వివాదం, కర్ణాటక ప్రభుత్వం తన నిర్ణయంతో ముందుకు వెళ్ళడానికి, భాను ముస్తాక్ మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించడానికి మార్గం సుగమం చేసింది.
