Let's talk: editor@tmv.in
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ

మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ

Aravind Maryada Reddy
16 సెప్టెంబర్, 2025

మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఝార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాలో భద్రతా దళాలు నిర్వహించిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో సీనియర్ కమాండర్ సహదేవ్ సోరెన్ ఉన్నారు. గోర్హర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పంతిత్రి అడవుల్లో 209 బెటాలియన్ కోబ్రా దళాలు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడిగా భావిస్తున్న సహదేవ్పై రూ.1 కోటి రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు సీనియర్ నేతలు రఘునాథ్ హేమంబరం (స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు, రూ.25 లక్షల రివార్డు), విర్సెన్ గంజూ (జోనల్ కమిటీ సభ్యుడు, రూ.10 లక్షల రివార్డు) కూడా హతమయ్యారు. భద్రతా దళాలు ఈ ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని, మూడు ఏకే-47 రైఫిళ్లు, ఇతర ఆయుధాలను సీజ్ చేశాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. హజారీబాగ్ ఎస్పీ హర్వీందర్ సింగ్ మాట్లాడుతూ, "ఈ ముగ్గురు మావో నేతలు ఏదో పెద్ద ఆపరేషన్కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందింది. వారిని ఎదుర్కొన్న మా దళాలు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశాయి" అని వెల్లడించారు.

సోరెన్ నేపథ్యం ఇదే.. సహదేవ్ సోరెన్ మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. అనేక ఆపరేషన్లలో అతడు భాగస్వామ్యం అయినట్టు పోలీసులు చెబుతన్నారు. గత జులైలో బొకారో జిల్లాలో పోలీసులు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా ఓ కోబ్రా జవాన్ను హతమార్చిన ఘటనలో అతడి పేరు వినిపించింది. ఆ సమయంలో తగిలిన తూటా గాయానికి ఆ జవాన్ మరణించాడు. సహదేవ్ ఝార్ఖండ్, బీహార్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. అతడిపై పలు హత్యలు, దాడులకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ 7న ఝార్ఖండ్లోనే మరో ఎన్కౌంటర్లో మావోయిస్టు సీనియర్ నాయకుడు అమిత్ హన్స్డా హతమయ్యాడు. జోనల్ కమాండర్ అయిన అతడిపై రూ.10 లక్షల రివార్డు ఉంది. 95 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు పోలీసులు, పౌరుల హత్యల్లో పాలుపంచుకున్నాడు.

మావోయిస్టుల ఏరివేత వేగవంతం

ఝార్ఖండ్తో పాటు పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్లో కూడా మావోయిస్టులపై భద్రతా బలగాలు దాడులను ముమ్మరం చేశాయి. 'ఆపరేషన్ కగార్' (ఫైనల్ మిషన్) పేరుతో నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్లో ఇప్పటికే పలువురు అగ్రనేతలు హతమయ్యారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మోడెం బాలకృష్ణ, అల్వాల్ చంద్రహాస్ సహా 10 మంది మావోయిస్టులు మరణించారు. 2025లో మాత్రమే ఛత్తీస్గఢ్లో 200కు పైగా మావోయిస్టులు హతమయ్యారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, 2013లో 1,136 హింసాత్మక ఘటనలు జరిగితే, 2023 నాటికి అవి 594కు తగ్గాయి. మావోయిస్టు పార్టీ చీఫ్ సహా పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. క్రమంగా మావోయిస్టులు ఒక్కొక్కరుగా మట్టుబెట్టబడుతున్నారు. ప్రభుత్వం 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మావోయిస్టులు బలహీనం

ప్రభుత్వ వైపు నుంచి చూస్తే ఇది భారీ విజయం. ఆపరేషన్ కగార్ వంటి కార్యక్రమాలు మావోయిస్టు బలాన్ని బలహీనపరుస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన నేతలను హతమార్చడం ద్వారా హింసాత్మక ఘటనలు తగ్గుతున్నాయి. ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 12 నుంచి 6కు తగ్గింది. ఇది భద్రతా దళాల వ్యూహాత్మక విజయాన్ని సూచిస్తుంది. మావోయిస్టులు మాత్రం వీటిని బూటకపు ఎన్ కౌంటర్లు అంటున్నారు. వారు తమను రక్షించుకోవడానికి పోరాడుతున్నామని, ప్రభుత్వం రాష్ట్ర హింసను ప్రయోగిస్తోందని వాదిస్తున్నారు. వామపక్ష పార్టీలు ఈ ఎన్కౌంటర్లను ఖండిస్తూ, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.

మానవహక్కుల సంఘాల అభ్యంతరాలు

ఈ ఆపరేషన్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు అక్రమ అరెస్టులు, హింస, నకిలీ ఎన్కౌంటర్లు, పౌరుల హత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి. ఆదివాసీలపై ఈ ఆపరేషన్లు 'యుద్ధం'గా మారుతున్నాయని, కార్పొరేట్ లూటీకి మార్గం సుగమం చేస్తున్నాయని ఆదివాసీ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ఛత్తీస్గఢ్లో ఆదివాసీలు భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య నలిగిపోతున్నారు. సల్వా జుడుం వంటి గత ఆపరేషన్లు మానవ హక్కుల ఉల్లంఘనలకు దారితీశాయి.

అసలు సమస్య ఏమిటి?

మావోయిస్టులు హింసా పద్ధతుల్లో చేస్తున్న ఉద్యమంపై అనేక విమర్శలు ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావులేదని ప్రజాస్వామ్యవాదులు గట్టిగా చెబుతున్నారు. అయితే మావోయిస్టులు గిరిజనుల సమస్యలు, భూముల పంపిణీ వంటి డిమాండ్లను తెరమీదకు తెస్తున్నారు.

గిరిజనుల హక్కుల కోసం మావోయిస్టు ఉద్యమం జరుగుతుంటే ఆ సమస్యలను పరిష్కరించకుండా మావోయిస్టులను చంపుకుంటే పోతే సమస్య పరిష్కారం అవుతుందా? అన్నది ఒక ప్రశ్న. కానీ ఛత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా మావోయిస్టులే అడ్డం పడుతున్నారని.. అక్కడ విద్య, రోడ్లు ఇతర మౌలిక వసతులు కల్పించకుండా మావోయిస్టులు ఆటంకాలు సృష్టిస్తున్నారు కాబట్టి.. వారిని నిర్మూలించి ఆ తర్వాత అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరి ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో వేచి చూడాలి.

మూల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం మళ్లీ లేవనెత్తవచ్చు. వేల మంది మరణాలు, లక్షల మంది శరణార్థులు అయ్యారు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, చర్చల ద్వారా మాత్రమే శాశ్వత పరిష్కారం సాధ్యమని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా, ఈ ఎన్కౌంటర్లు మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరుస్తున్నప్పటికీ, మానవ హక్కులు, సామాజిక న్యాయం కోణాల్లో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - Tholi Paluku