Let's talk: editor@tmv.in
మళ్లీ డబ్ల్యూటీసీ రేసులోకి కివీస్.. విండీస్‌తో హోరాహోరీ ప్రారంభం

మళ్లీ డబ్ల్యూటీసీ రేసులోకి కివీస్.. విండీస్‌తో హోరాహోరీ ప్రారంభం

Koripelli Aditya
2 డిసెంబర్, 2025

ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) తొలి చాంపియన్లు న్యూజిలాండ్ జట్టు మళ్లీ సత్తా చాటాలనే ఆశతో గురువారం నుంచి వెస్టిండీస్‌తో హోరాహోరీ పోరుకు సిద్ధమవుతోంది. ఇంటి మైదానంలో ఈ మూడు టెస్టుల సిరీస్‌తో కివీస్ ఈ కొత్త సైకిల్‌లో తొలి పాయింట్లు సాధించే అవకాశాన్ని అందుకోనుంది. ఇప్పటి వరకు ఈ సైకిల్‌లో ఒక్క టెస్టు కూడా ఆడని ఏకైక జట్టుగా ఉన్న న్యూజిలాండ్, క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో మొదటి టెస్టుతో బరిలోకి దిగనుంది.

2023లో డబ్ల్యూటీసీ ట్రోఫీని అందుకున్న కివీస్ ఈ సైకిల్‌లో కేవలం మూడు హోమ్ సిరీస్‌లు మాత్రమే ఆడనున్నారు. మిగతావి మూడు సిరీస్‌లు అన్నీ హోమ్-అవే సిరీస్‌లు. వాటిలో వచ్చే వేసవిలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కూడా ఉంది. అది కీవీస్‌కు చాలా కఠినమైన పరీక్ష అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

ఇటీవల హోమ్-అవే మైదానాల్లో, టెస్టుల్లో న్యూజిలాండ్ బాగానే రాణిస్తోంది. అయినా ఇంటి పిచ్‌ల్లో గెలవడం ముఖ్యమే అని హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ అభిప్రాయపడుతున్నారు. ‘ఇంటి మైదానంలో గెలవడం కీలకం. కానీ అదే అంతా అని కాదు. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా గెలుస్తున్నారు. మనకు బాగా తెలిసిన పిచ్‌లు మనవే కాబట్టి, బలంగా ప్రారంభించి, డబ్ల్యూటీసీలో ముందుండాలి’ అని వాల్టర్ తెలిపారు.

‘టెస్టు క్రికెట్‌లో మా జట్టుకు స్పష్టమైన గుర్తింపు ఉంది. గతంలో జట్టుగా అద్భుతంగా ఆడాం. ఇప్పుడు మళ్లీ అదే రిథమ్‌లోకి రావాలి’ అని అన్నారు కోచ్ వాల్టర్. వెస్టిండీస్‌తో జరిగిన వైట్ బాల్ సిరీస్‌ల్లో న్యూజిలాండ్ ఆధిపత్యం చూపించింది. మూడు వన్డేలను క్లీన్ స్వీప్ చేసి, ఐదు టీ20ల్లో 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆ జోరును రెడ్ బాల్‌లోనూ కొనసాగించాలని కోచ్ ఆశిస్తున్నారు. అయితే విండీస్ జట్టు పేస్ దాడి ఇప్పటికీ ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు. షమార్ జోసెఫ్, అల్జారీ జోసెఫ్ గాయంతో దూరమైనా, కీమార్ రోచ్ నేతృత్వంలో ఆండర్సన్ ఫిలిప్, జోహాన్ లేన్, డెబ్యూ అవకాశం ఉన్న ఒజే షీల్డ్స్ వంటి వేగవంతమైన ప్లేయర్లు ఉన్నారు.

హాగ్లీ ఓవల్ పిచ్ సీమర్లకు ఎప్పటిలాగే సహకారం అందించే అవకాశం ఉంది. ‘వాళ్లకు బలమైన సీమ్ దాడి ఉంది, ప్రమాదకర బ్యాటర్లు ఉన్నారు, చాలా సేపు బ్యాటింగ్ చేయగలరు. క్రికెట్‌ను గౌరవించి, పోరాటానికి సిద్ధంగా ఉండాలి’ అని వాల్టర్ తెలియజేశారు.

‘హాగ్లీ ఓవల్ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మాకు బాగా తెలుసు. అయినా మా అతి పెద్ద బలం మా ప్లేయర్లు ఏ పిచ్‌కి అయిన అడాప్ట్ అయ్యే సామర్థ్యం ఉంది. ఏదో ఒక ప్లాన్‌తో తయారవుతాం కానీ, క్రికెట్ అనేది ఊహించని మలుపులు తిప్పగలదు. దానికి మేము సిద్ధంగా ఉండాలి’ అని కోచ్ స్పష్టం చేశారు.

సంభావ్య జట్టు:

న్యూజిలాండ్:

టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మైకేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, కేన్ విలియమ్‌సన్, విల్ యంగ్

వెస్టిండీస్:

రోస్టన్ చేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, జాన్ క్యాంప్‌బెల్, తగేనరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, కవెమ్ హోడ్జ్, షాయి హోప్, టెవిన్ ఇమ్లాచ్, బ్రాండన్ కింగ్, జోహాన్ లేన్, ఆండర్సన్ ఫిలిప్, కీమార్ రోచ్, జైడెన్ సీల్స్, ఒజే షీల్డ్స్

మళ్లీ డబ్ల్యూటీసీ రేసులోకి కివీస్.. విండీస్‌తో హోరాహోరీ ప్రారంభం - Tholi Paluku