Let's talk: editor@tmv.in
మ‌ళ్లీ మోడీ తల్లిని దూషించారు : బీజేపీ ఆరోప‌ణ‌

మ‌ళ్లీ మోడీ తల్లిని దూషించారు : బీజేపీ ఆరోప‌ణ‌

FL - BRTH
22 సెప్టెంబర్, 2025

బీహార్ లోని ఆర్జేడీ, కాంగ్రెస్ కూట‌మి త‌న త‌ల్లిని అవ‌మానించార‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గ‌తంలో ఆరోపించారు. ఆ వివాదం ఇంకా స‌ద్దుమ‌ణ‌గక ముందే బీజేపీ తాజాగా మరో ఆరోప‌ణ చేసింది. ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్ ర్యాలీలో కొంద‌రు న‌రేంద్ర మోడీ త‌ల్లిని అవ‌మానించేలా నినాదాలు చేశార‌ని బీజేపీ ఓ వీడియోను విడుద‌ల చేసింది. తేజ‌స్వీ యాద‌వ్ వేదిక మీద మాట్లాడుతుండ‌గా వేదిక కింద నుంచి మోడీ త‌ల్లిని దూషిస్తూ నినాదాలు చేస్తున్న వీడియోను ఎక్స్ వేదికగా బీజేపీ షేర్ చేసింది. తాజాగా ఈ అంశం బీహార్ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఆరోప‌ణ‌ల‌ను ఆర్జేడీ ఖండించింది. న‌కిలీ వీడియో సృష్టించి, ఆర్జేడీని దెబ్బ‌తీయడానికే బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించింది.

మోడీ త‌ల్లిని తిట్ట‌డానికి తేజిస్వీ మ‌ళ్లీ స‌హ‌క‌రించాడ‌ని, ఆర్జేడీ, కాంగ్రెస్ త‌ల్లి, అక్కచెల్లెల్ల‌ను తిట్ట‌డ‌మే కార్య‌క్ర‌మంగా పెట్టుకున్నాయ‌ని బీజేపీ ఎక్స్ పోస్ట్ లో పేర్కొంది. ఆర్జేడీ, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల వ్య‌వ‌హారం శృతిమించింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌ల్లిని తిట్టే వారిని బీహార్ మ‌రిచిపోద‌ని, ప్ర‌తి మాటకు త‌ల్లులు, చెల్లెల్లు స్పందిస్తార‌ని పేర్కొంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌ల్లిని ఆర్జేడీ కార్య‌క‌ర్త‌లే కాదు ..ఎవ‌రూ కూడా దూషించ‌లేద‌ని ఆర్జేడీ ఎమ్మెల్యే ముకేష్ రౌష‌న్ స్ప‌ష్టం చేశారు. తేజ‌స్వీ యాదవ్ ప్ర‌సంగం వీడియో మొత్తాన్ని చూడ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఆ వీడియోలో ఎక్క‌డా మోడీ త‌ల్లికి వ్య‌తిరేకంగా నినాదాలు ఇవ్వ‌లేద‌ని తెలిపారు. బీజేపీ విడుద‌ల చేసిన వీడియోలో తేజ‌స్వీ యాద‌వ్ మాట్లాడ‌టం లేద‌ని చెప్పారు. బీజేపీ ఫేక్ వీడియో చేసి ఆర్జేడీ ప‌రువు తీయడానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఎమ్మెల్యే ముకేష్ రౌష‌న్ స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో ఆర్జేడీ, కాంగ్రెస్ కూట‌మి వేదిక నుంచి కొంద‌రు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌ల్లిని దూషించార‌ని బీజేపీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ వివాదం పై మోడీ కీల‌క వ్యాఖ్యలు చేశారు. త‌ల్లిని అవమానించే వారిని తాను క్ష‌మించ‌వచ్చు కానీ.. బీహార్, భార‌త‌దేశం ఎప్ప‌టికీ క్ష‌మించ‌ద‌ని మోడీ వ్యాఖ్యానించారు. రాజ కుటుంబాల్లో పుట్టిన వారు పేద త‌ల్లుల‌ను, వారి కొడుకుల పోరాటాల‌ను ఎప్ప‌టికీ అర్థం చేసుకోలేర‌ని విమ‌ర్శించారు. రాహుల్, తేజ‌స్వీ గోల్డ్, సిల్వ‌ర్ స్పూన్ల‌తో పుట్టిన వార‌న్నారు. బీహార్ లోని అధికారం వారి కుటుంబాల‌కే చెందుతుంద‌ని వారు న‌మ్ముతార‌ని మోడీ విమ‌ర్శించారు. కానీ ప్ర‌జ‌లు పేద త‌ల్లి కొడుకును దేశ ప్ర‌ధానిగా చేశారని మోడీ అన్నారు. త‌న త‌ల్లిని ఆర్జేడీ, కాంగ్రెస్ కూట‌మి కార్య‌క‌ర్త‌లు దూషించారంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆరోపించి వారాలు కూడా గ‌డ‌వ‌క ముందే బీజేపీ మ‌రోసారి అలాంటి ఆరోప‌ణే చేయ‌డం బీహార్ రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న వాడివేడికి అద్దం ప‌డుతోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మ‌ళ్లీ మోడీ తల్లిని దూషించారు : బీజేపీ ఆరోప‌ణ‌ - Tholi Paluku