Let's talk: editor@tmv.in
మల్లారంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు

మల్లారంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు

Gaddamidi Naveen
17 నవంబర్, 2025

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సిద్దిపేట జిల్లా, చిన్నకోడూరు మండలం, మల్లారం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి, ఇప్పటివరకు కేవలం ఐదు ఆరు లక్షల మెట్రిక్ టన్నులకే కొనుగోళ్లను పరిమితం చేసిందని హరీశ్ రావు విమర్శించారు.

కొనుగోలు చేసిన వడ్లకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయని, దాదాపు 1200 కోట్ల రూపాయల ఎంఎస్‌పీ బకాయిలు ఇంకా చెల్లించలేదని తెలిపారు. అదేవిధంగా గత యాసంగి బోనస్‌ సహా సుమారు 200 కోట్ల రూపాయలు రైతులకు రావలసి ఉన్నాయన్నారు. 24 గంటల్లో బోనస్ ఇస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆయన ఆరోపించారు. వెంటనే గత యాసంగి, ఈ వానాకాలం బోనస్ నిధులను విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర చలిలో పడిగాపులు కాస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు గడుపుతున్నారని, ప్రభుత్వం తక్షణమే వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. మిల్లులతో వెంటనే టైఅప్ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మక్క, పత్తి రైతుల దుస్థితి

మక్క రైతులు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల ఎకరాల్లో మక్కలు పండినా, మక్క కొనుగోళ్లను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, ముఖ్యమంత్రి మక్కల కొనుగోలును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.కొనుగోళ్లు చేసిన‌ మక్క రైతులకు డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.పత్తి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం విధానాల వల్ల రైతులు అరిగోస పడుతున్నారని, ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటామనడం అన్యాయమని అన్నారు. కొన్ని జిల్లాల్లో 11-12 క్వింటాళ్లు పండితే, మిగిలిన పత్తిని ఏం చేయాలని ప్రశ్నించారు. జిన్నింగ్ మిల్లులు, కేంద్ర ప్రభుత్వ సీసీఐ కొనుగోళ్లు సరిగా లేకపోవడం వల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని తెలిపారు.

రైతు బంధు, రుణమాఫీ, నష్ట పరిహారంపై విమర్శలు

రాష్ట్ర రైతు సంక్షేమం విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని హరీష్ రావు ఆరోపించారు. రెండు పంటలకు రైతు బంధు ఇవ్వలేదని, బోనస్ ఇవ్వలేదని, పంటల బీమా అమలు చేయలేదని, రుణమాఫీ కూడా సగం మందికి మాత్రమే జరిగిందని విమర్శించారు. గత యాసంగి వడగండ్ల వానలోనూ, ఈ ఏడాది తుఫాన్ వల్ల పంటలు నష్టపోయినా రైతులకు పరిహారం అందలేదని పేర్కొన్నారు.పంట బీమా ఉంటే రైతులకు భారీగా సహాయం అయ్యేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన రైతులకు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.