Let's talk: editor@tmv.in
మల్లన్న సన్నిధిలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్

మల్లన్న సన్నిధిలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్

Panthagani Anusha
21 డిసెంబర్, 2025

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ శనివారం నంద్యాల జిల్లాలోని శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ఆయన శనివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న సీఈసీకి దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న జ్ఞానేశ్ కుమార్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకున్న ఆయన, శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలోనే ఆలయాన్ని సందర్శించి స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. రాత్రికి భ్రమరాంబ అతిథి గృహంలో బస చేసిన ఆయన శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఆలయంలో జరిగిన మహాహారతి సేవలో పాల్గొన్నారు.

పూజా కార్యక్రమాల్లో భాగంగా సీఈసీ దంపతులు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో స్వామివార్లను దర్శించుకోవడం తన అదృష్టమని ఈ పర్యటన తనకు ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

శనివారం ఉదయం 11 గంటల సమయంలో శ్రీశైలం నుండి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన సీఈసీ, నగరంలోని చారిత్రక కట్టడాలైన గోల్కొండ కోట, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియంలను సందర్శించనున్నారు. ఆదివారం (డిసెంబర్ 21న) రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర బూత్ లెవల్ అధికారులతో జరిగే కీలక సమావేశంలో పాల్గొన్న ఎన్నికల నిర్వహణ విధివిధానాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటన ముగిసిన అనంతరం ఆయన తిరిగి ఢిల్లీకి వస్తారని అధికారులు వెల్లడించారు.

మల్లన్న సన్నిధిలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ - Tholi Paluku