
మలేషియా మిస్టరీ వైరస్
మలేషియా అనే ఆ అందమైన దేశం... అకస్మాత్తుగా ఒక విచిత్రమైన భయానికి వేదిక అయింది. ఇప్పుడు అక్కడ పిల్లల నవ్వులు కనిపించడంలేదు. స్కూల్ బెల్ మోగడంలేదు. ఆటల గోల వినిపించడంలేదు. చాలా ప్రాంతాల్లో నిశ్శబ్దం మాత్రమే గాలి లాగా తిరుగుతోంది. దాదాపు 6వేల మంది విద్యార్థులు ఒకే సమయంలో జ్వరంతో పడిపోవడం ప్రజలను షాక్‌కు గురిచేసింది. మొదట ఇది చిన్న జలుబు అని అనుకున్నారు. కానీ రోజు రోజుకూ సంఖ్య పెరిగేకొద్దీ.. అది జ్వరంగా మారింది. పిల్లల ముఖాల్లో అలసట, కళ్లలో నీరసం కనిపిస్తోండడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది.. కానీ ఆ భయానికి సరిహద్దులు లేవు. మనసులో ఒక్క ప్రశ్న మాత్రమే తిరుగుతోంది. ఇది సాధారణ జ్వరమేనా? లేదా కోవిడ్ మళ్లీ పడగవిప్పిందా? లేదా మరొక రహస్య వ్యాధి రూపంలో మన ముందుకు వస్తున్న కొత్త ప్రమాదమా? వీటికి సమాధానం చెప్పలేక డాక్టర్లు కూడా తలపట్టుకుంటున్నారు.
ఇటు దేశం మొత్తం ఒక్కసారిగా కలవరపడింది. ఒక స్కూల్ తర్వాత ఇంకో స్కూల్, ఒక జిల్లా తర్వాత ఇంకో జిల్లాలో కేసులు ఎగసిపడుతున్నాయి. ఒక్క వారంలోనే 97 క్లస్టర్లు నమోదయ్యాయి. ముందు ఇది చిన్న ప్రాంతాల వరకే ఉందని అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రీ స్కూల్ నుంచి కాలేజీల వరకూ ఈ జ్వరం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. పిల్లల దగ్గు, తుమ్ము బలహీనత చూసి తల్లిదండ్రులు భయంతో పిల్లలను బయటకు పంపడం ఆపేశారు. హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు పర్యటనలు మొదలుపెట్టారు. స్కూల్స్‌కు గైడ్ లైన్స్ జారీ చేశారు. మాస్క్ ధరించండి, గుంపుగా చేరొద్దు, శానిటైజర్ వాడండని చెప్పినా ఆ భయం మాత్రం తగ్గడం లేదు. ప్రతీ ఒక్కరి మనసులో అదే సందేహం. ఇది సాధారణ జలుబా లేదా మళ్లీ పాత నీడ తిరిగి వచ్చిందా అనే అనుమానం కలుగుతోంది.
మరోవైపు ప్రభుత్వం పరిస్థితిని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తోంది. స్కూల్స్‌లో వైద్య బృందాలు పనిచేస్తున్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నారు. ప్రజలకు జాగ్రత్త సూచనలు ఇస్తున్నారు. కానీ భయం మాత్రం ఇంకా తగ్గలేదు. ప్రతి ఇంటిలో చర్చ అదే. కొంతమందికి కరోనా రోజులు గుర్తొస్తున్నాయి. ఆ సమయంలో విన్న ఆ సైరన్ శబ్దాలు, ఆ ఖాళీ రోడ్లు, ఆ మాస్కులు మళ్లీ కళ్లముందు తిరుగుతున్నాయి. ఇంతలో మరో వార్త వెలుగులోకి వచ్చింది. మలేషియాలో కొత్త కోవిడ్ వేరియంట్‌ను ఆరోగ్యశాఖ గుర్తించింది. దాని పేరు ఎక్స్‌ఎఫ్‌జీ. ఇది గత జూన్‌లో ఇండియాలో మొదట కనిపించింది. ఇప్పుడదే మలేషియాలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ శరీర కణాలతో సులభంగా కలిసిపోతుంది. రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే శక్తి ఉంది. ఇది సాధారణ వేరియంట్ కాదు. దీని వేగం, వ్యాప్తి సామర్థ్యం భయపెడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని పరిశీలనలో ఉన్న వేరియంట్‌గా ప్రకటించింది.
శాస్త్రవేత్తలు ఈ వేరియంట్‌పై మరింత అధ్యయనం చేస్తున్నారు. వైరస్ స్వభావం మారడం సహజమని వారు చెబుతున్నా, ఈ మార్పు మానవాళికి మళ్లీ కొత్త పరీక్ష తెస్తుందేమో అన్న ఆందోళన ఉంది. మలేషియా ప్రభుత్వం జన్యు పరిశీలనను పెంచింది. కొత్త కేసులను గుర్తించి నియంత్రించడానికి చర్యలు తీసుకుంటోంది. ఇటు ప్రజల భయం, సందేహం ఇంకా గాలిలో తేలుతూనే ఉంది. ఇది సాధారణ ఫ్లూకి సంబంధించినదేనా, లేదా మళ్లీ మహమ్మరి విజృంభిస్తుందా అనే డౌట్ వస్తుంది. సమాధానం ఇంకా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. వైరస్‌లు నిద్రపోవు. అవి రూపం మార్చుకుంటూ మానవజాతిని కొత్తగా పరీక్షిస్తూనే ఉంటాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదేనండి!
