
మలేషియా గడ్డపై మోడీ 'ఇంపాక్ట్'
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం రెండు రోజుల పర్యటన నిమిత్తం మలేషియా చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం స్వయంగా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, "కౌలాలంపూర్‌లో అడుగుపెట్టాను. నా మిత్రుడు ప్రధాని అన్వర్ ఇబ్రహీం విమానాశ్రయంలో అందించిన ఆత్మీయ స్వాగతానికి నేను ఎంతో ముగ్ధుడ్ని అయ్యాను. మా చర్చల ద్వారా భారత్-మలేషియా మధ్య స్నేహ బంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి నేను ఎదురుచూస్తున్నాను" అని పేర్కొన్నారు.
అనంతరం ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడి, కౌలాలంపూర్‌లో జరిగిన భారత సంతతి ప్రతినిధుల సదస్సులో ఉత్సాహభరిత ప్రసంగం చేశారు. భారత్ సాధిస్తున్న ప్రతి విజయం మలేషియా విజయంగానే తాము భావిస్తామని, ఈ పరస్పర సహకారం ఆసియా శతాబ్దపు స్వప్నాన్ని సాకారం చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారతదేశం, మలేషియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కేవలం రెండు దేశాలకే పరిమితం కాదని, అవి యావత్ ఆసియా ఖండపు పురోగతికి దిక్సూచి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు.
ఈ పర్యటనలో ప్రధాని మోడీ రెండు దేశాల భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు ‘ఇంపాక్ట్’ అనే సరికొత్త దార్శనికతను ఆవిష్కరించారు. ‘ఇంపాక్ట్’ (ఇండియా–మలేషియా పార్టనర్ షిప్ ఫర్ అడ్వాన్సింగ్ కలెక్టివ్ ట్రాన్స్ ఫార్మేషన్) అంటే ఉమ్మడి పరివర్తన కోసం భారత్-మలేషియా భాగస్వామ్యం అని అర్థం. ఈ మంత్రం ద్వారా ద్వైపాక్షిక సంబంధాల వేగాన్ని పెంచడం, మన ఆశయాల పరిధిని విస్తరించడం, రెండు దేశాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని ఆయన వివరించారు.
శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ సాధిస్తున్న పురోగతికి మలేషియా ఇస్తున్న మద్దతును ప్రధాని కొనియాడారు. ముఖ్యంగా చంద్రయాన్-3 విజయవంతమైనప్పుడు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం పంపిన అభినందనలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని మోడీ గుర్తుచేసుకున్నారు. ఒకరి విజయాలను మరొకరు సొంత విజయాలుగా భావించుకోవడం ద్వారానే అంతర్జాతీయ వేదికపై ఆసియా దేశాల బలం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్థిక సహకారం గురించి మాట్లాడుతూ, మలేషియాలో భారతీయ కంపెనీల ప్రభావాన్ని మోదీ ప్రస్తావించారు. ప్రస్తుతం మలేషియాలో దాదాపు 100కు పైగా భారతీయ ఐటీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తూ వేలాది మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. అలాగే, మలేషియాలో ఆసియాలోనే అతిపెద్ద ఇన్సులిన్ తయారీ కేంద్రాన్ని నిర్మించడంలో భారతదేశం కీలక పాత్ర పోషించడం గర్వకారణమని ఆయన సభికుల చప్పట్ల మధ్య తెలియజేశారు.
డిజిటల్ రంగంలో భారత్ సాధించిన విప్లవాత్మక మార్పులు ఇప్పుడు మలేషియాకు కూడా విస్తరించనున్నాయి. భారతదేశపు ప్రతిష్టాత్మక డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ) త్వరలోనే మలేషియాలో అందుబాటులోకి వస్తుందని ప్రధాని ప్రకటించారు. దీనికోసం 'మలేషియా-ఇండియా డిజిటల్ కౌన్సిల్' నిరంతరం కృషి చేస్తోందని, ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలను మరింత సులభతరం వేగవంతం చేస్తుందని ఆయన వివరించారు.
భారతదేశ ఆర్థిక ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన అద్భుత వృద్ధిని మోడీ వివరించారు. ఒకప్పుడు ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, నేడు ప్రపంచంలోనే టాప్ 3 ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదిగేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. 'మేక్ ఇన్ ఇండియా' పథకం ద్వారా నేడు ప్రపంచంలో మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ రెండో స్థానంలో నిలిచిందని, ఇది దేశ పారిశ్రామిక శక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ సాధించిన మైలురాళ్లను వివరిస్తూ, గత పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయిందని మోదీ తెలిపారు. రికార్డు స్థాయిలో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని, వందే భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయని చెప్పారు. ఆధునిక భారతాన్ని స్వయంగా చూడాలని, మీ మలేషియా మిత్రులను కూడా వెంటబెట్టుకుని 'ఇన్క్రెడిబుల్ ఇండియా'ను సందర్శించాలని ఆయన భారత సంతతికి పిలుపునిచ్చారు.
చివరగా, ప్రజల మధ్య సంబంధాలే రెండు దేశాల బంధానికి పునాది అని ప్రధాని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రపు నీలి జలాలు మనల్ని భౌగోళికంగానే కాకుండా సాంస్కృతికంగా కూడా కలిపి ఉంచుతున్నాయని అన్నారు. మలేషియాలోని భారత సంతతి ప్రజలు రెండు దేశాల మధ్య వారధులుగా పనిచేస్తున్నారని అభినందిస్తూ, రాబోయే రోజుల్లో ఈ 'కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్' మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని ఆకాంక్షిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఇరు దేశాల ప్రధానుల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తృతం చేసేలా పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
పర్యటనకు బయలుదేరే ముందు మోడీ మాట్లాడుతూ, ఈ పర్యటనలో ప్రధానంగా రక్షణ రంగ సహకారం, బలమైన ఆర్థిక భాగస్వామ్యంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. "భారత్-మలేషియా మధ్య చారిత్రక సంబంధాలు ఇటీవలి కాలంలో స్థిరమైన పురోగతిని సాధించాయి. మా 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత పటిష్టం చేయడం మా లక్ష్యం" అని ప్రధాని అన్నారు.
రక్షణ, భద్రత, ఆర్థికం, ఆవిష్కరణలతో పాటు కొత్త రంగాలలో కూడా భాగస్వామ్యాన్ని విస్తరిస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యవిషయం ఏమిటంటే, ఆగస్టు 2024లో భారత్-మలేషియా తమ ద్వైపాక్షిక సంబంధాలను 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచుకున్నాయి.
