Let's talk: editor@tmv.in
మలేషియా ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్స్‌కు సింధు, సాత్విక్–చిరాగ్

మలేషియా ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్స్‌కు సింధు, సాత్విక్–చిరాగ్

Pinjari Chand
9 జనవరి, 2026

మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన పీ.వి. సింధు, అలాగే పురుషుల డబుల్స్ జోడీలో సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డి – చిరాగ్ షెట్టి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) సూపర్ 1000 టోర్నీలో భాగంగా బరిలోకి దిగిన సింధు, మహిళల సింగిల్స్‌లో జపాన్‌కు చెందిన ఎనిమిదో సీడ్ ఆటగాళ్లను మట్టికరిపించి చివరి ఎనిమిది మందిలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంలో ఉన్న సింధు, తన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ 33 అయిన చైనీస్ తైపే ఆటగాళ్లను 21-13, 22-20 తేడాతో ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను పూర్తి ఆధిపత్యంతో 21-8తో గెలుచుకుని, అదే జోరును కొనసాగిస్తూ రెండో గేమ్‌ను 21-13తో ముగించి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో సింధు, చైనాకు చెందిన గావో ఫాంగ్ జీ, జపాన్ మూడో సీడ్ అకానే యమగుచీ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో తలపడనున్నారు.

ఈ సారి 39 నిమిషాల్లో ఖేల్ ఖతం

పురుషుల డబుల్స్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన చిరాగ్ షెట్టి – సాత్విక్ ‌సాయిరాజ్ రాంకిరెడ్డి జోడీ కూడా అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. మలేషియాకు చెందిన జునైడి ఆరిఫ్ – రాయ్ కింగ్ యాప్ జోడీపై వీరు 21-18, 21-11 స్కోరుతో కేవలం 39 నిమిషాల్లో విజయం సాధించారు. ఈ గెలుపుతో మలేషియన్ జోడీపై భారత జోడీ హెడ్-టు-హెడ్ రికార్డు 4-0కు చేరింది. తదుపరి రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ, చైనీస్ తైపేకు చెందిన చెన్ జీ రే / లిన్ యు చియెహ్, ఇండోనేషియాకు చెందిన ఆరో సీడ్ జోడీ ఫజర్ ఆల్ఫియన్ / ఫిక్రి మహ్మద్ మధ్య మ్యాచ్ విజేతతో తలపడనుంది. ఇదివరకే రెండో రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ, చైనీస్ తైపేకు చెందిన లీ జే-హుయి – యాంగ్ పో-హ్సువాన్ జోడీపై 21-13, 21-15 తేడాతో కేవలం 35 నిమిషాల్లో గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.