Let's talk: editor@tmv.in
మల్లన్నకు అంత సీన్ ఉందా?

మల్లన్నకు అంత సీన్ ఉందా?

Aravind Maryada Reddy
20 సెప్టెంబర్, 2025

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ప్రముఖ జర్నలిస్ట్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటూ ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. బీసీలకు రాజ్యాధికారం తీసుకురావడమే తన పార్టీ లక్ష్యమని చెబుతున్నారు. మరి ఆయన స్థాపించిన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభావం చూపిస్తుందా? బీసీలు ఆయన వెంట నడుస్తారా? మల్లన్నకు ప్రజల్లో అంత పలుకుబడి విశ్వసనీయత ఉన్నాయా? యూట్యూబ్ జర్నలిస్ట్‌గా సక్సెస్ అయిన మల్లన్న.. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రాణించగలరా? తెలంగాణలో నిజంగానే రాజకీయ శూన్యత ఉందా? ఇప్పటికే ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ ఉంది. మరో ప్రాంతీయ పార్టీ విజయం సాధించగలదా? అన్నది వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా గణనీయమైన సంఖ్యలో ఉంది. తమకు రాజ్యాధికారం దక్కలేదన్న అసంతృప్తి కూడా వారిలో ఉంది. అయితే మల్లన్నను తెలంగాణ రాష్ట్రంలోని బీసీలు నమ్ముతారా? ఆయన వెంట నడుస్తారా? అన్నదే ప్రశ్న.

మల్లన్న ధైర్యం ఏమిటి?

తెలంగాణలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు ఇప్పటి వరకు సరైన రాజకీయ ప్రాతినిథ్యం రాలేదని, తాను ఆ లోటు పూడుస్తానని మల్లన్న ధైర్యంగా చెబుతున్నారు. అయితే రాజకీయ ప్రయాణం నిజంగానే విజయవంతం అవుతుందా? లేదంటే ఏవైనా సవాళ్లను ఆయన ఎదుర్కొంటారా? అన్నది వేచి చూడాలి. తీన్మార్‌ మల్లన్న ఎప్పటి నుంచో తన ప్రసంగాల్లో బీసీలకు సరైన గుర్తింపు రావడం లేదని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారన్నది ఆయన ఆరోపణ. బీసీల ఓట్లతోనే అధికారంలోకి వచ్చినా, క్యాబినెట్‌లో, కీలక పదవుల్లో, వారిని పెద్దగా ప్రోత్సహించడం లేదని మల్లన్న బీసీల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.

బీసీలు ఒకే తాటిపై నడుస్తారా?

తెలంగాణలో బీసీ జనాభా అధికంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనతో ఆ విషయం నిర్ధారణ అయ్యింది. కానీ వారు సామాజికంగా, రాజకీయంగా ఒకే వేదికపై ఇప్పటి వరకు రాలేదు. రాష్ట్రంలోని మున్నూరు కాపులు, యాదవులు, గౌడ్‌లు, ముదిరాజులు, వడ్డెరలు, నాయి బ్రాహ్మణులు వంటి అనేక వర్గాలు బీసీల్లో ఉన్నారు. ఈ వర్గాల మధ్య కూడా ఆధిపత్య పోరు ఉంటుంది. వీరిని ఒక్కతాటి మీదకు తీసుకురావడం ఏకం చేయడం అంత సులభం కాదు. ఇప్పటికే బీసీల కోసం అనేక కుల సంఘాలున్నాయి. వాటిని ఒక్కతాటి మీదకు తీసుకొచ్చి.. తన నాయకత్వంలో పనిచేసేలా మల్లన్న చేయగలరా? అన్నదే ప్రశ్న.

గతంలోనూ ఇటువంటి ప్రయోగాలు ..

బీసీలను ఒక్క తాటిమీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు గతంలో అనేక సందర్భాల్లో జరిగాయి. అయితే ఈ ప్రయోగాలు ఎప్పుడూ విజయవంతం అవ్వలేదు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సామాజిక న్యాయం నినాదంతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి భారీ హంగామాతో ముందుకొచ్చినా, చివరికి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే విలీనం అయ్యింది. దేవేందర్‌ గౌడ్‌ నవ తెలంగాణ పార్టీని తీసుకొచ్చినా, ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఈ ఉదాహరణలు చూస్తే మల్లన్న ముందున్న మార్గం ఎంత కఠినమో అర్థమవుతుంది.

మల్లన్నకు ఉన్న ప్లస్ పాయింట్లు ఇవే..

బీసీ వర్గాల గళాన్ని బలంగా వినిపించే వ్యక్తిగా ఇప్పటికే మల్లన్నకు మంచి పేరుంది. యూట్యూబ్‌ ద్వారా ఆయనకు పెద్ద స్థాయిలో అనుచరగణం ఉంది. యువతలో ఆయనకు గుర్తింపు ఉంది. ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించే ధైర్యం మల్లన్నకు ఉంది. బీసీలలో ఒకే నాయకుడిని అంగీకరించే స్థితి లేదు. మల్లన్నకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అన్నీ బీసీలకోసం ప్రత్యేక పథకాలు ప్రకటిస్తున్నాయి. మరి మల్లన్నకు ఇది కూడా కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉంది. కేవలం కులం లేదా వర్గాన్ని ఆశ్రయించి పార్టీ ముందుకు సాగితే దీర్ఘకాలం నిలబడటం కష్టమే. పార్టీకి స్పష్టమైన సిద్ధాంతం, ఆచరణలో అమలు చేయగలిగే విధానాలు అవసరం. సమాజంలోని అన్ని వర్గాలను చేర్చుకునే విధానాన్ని తీసుకురావాలి.

తీన్మార్‌ మల్లన్న ప్రభావం ఎంత?

ప్రస్తుతానికి మల్లన్న ప్రభావం మీడియా స్థాయిలో, సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ఆయన ప్రభావం కాస్త తక్కువే. రాజకీయ పార్టీని నడిపించాలంటే పార్టీకి సంస్థాగత బలం కూడా ఎంతో ముఖ్యం. ప్రజల మధ్య బలమైన క్యాడర్ లేకుండా, కేవలం వ్యక్తిగత గుర్తింపుతోనే పార్టీని నిలబెట్టడం కష్టం. అయినప్పటికీ, బీసీ వర్గాల అసంతృప్తిని చక్కగా వినియోగించగలిగితే, తీన్మార్‌ మల్లన్న కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవడం ఖాయం. కానీ ఆయన లక్ష్యం బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందా అన్నది మాత్రం కాలమే తేల్చాలి. బీసీలు ఒకే తాటిపై రాకపోతే, ఆయన పార్టీ కూడా గత రాజకీయ ప్రయోగాల మాదిరిగానే చరిత్రలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అయితే ఆయన యువతలో సృష్టిస్తున్న ఆకర్షణను, సోషల్‌ మీడియా శక్తిని రాజకీయంగా ఉపయోగించగలిగితే కొంత మేర ప్రభావం చూపించవచ్చు.

బీసీ నినాదాన్నే నమ్ముకున్న కాంగ్రెస్, బీజేపీ

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ జపం చేస్తోంది. బీజేపీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది. ఇలా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ బీసీ జపం చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత కూడా బీసీ జపం చేస్తున్నారు. మరి బీసీలు వీరందరినీ పట్టించుకోకుండా మల్లన్న వైపు తిరిగిచూస్తారా? అన్నది వేచి చూడాలి. ఇక తీన్మార్ మల్లన్న ప్రజల్లోకి వెళితే అతడి ప్రభావం ఎంత మేర ఉంటుందో అన్నది తేలనున్నది. మరి తీన్మార్ మల్లన్న పార్టీ త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుందా? అన్నది వేచి చూడాలి. ఈ ఎన్నికల్లో మల్లన్న ఎటువంటి నినాదంతో జనంలోకి వెళ్తారో వేచి చూడాలి. బీసీలకు రాజ్యాధికారం అనే ఏకైక నినాదంతో ఆయన జనంలోకి వెళితే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఆయనకు దూరమయ్యే అవకాశం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా రాణించాలంటే కచ్చితంగా అందుకు సంబంధించిన బలమైన ఉద్యమం జరగాలి. మరి తీన్మార్ మల్లన్న ఎటువంటి నినాదంతో జనంలోకి వెళ్తారో వేచి చూడాలి.

మల్లన్నకు అంత సీన్ ఉందా? - Tholi Paluku