Let's talk: editor@tmv.in
మలక్కా జలసంధిపై భారత్ నిఘా: కార్ నికోబార్ వైమానిక స్థావరంలో కొత్త రన్‌వే సిద్ధం

మలక్కా జలసంధిపై భారత్ నిఘా: కార్ నికోబార్ వైమానిక స్థావరంలో కొత్త రన్‌వే సిద్ధం

Dantu Vijaya Lakshmi Prasanna
3 జనవరి, 2026

అండమాన్ నికోబార్ దీవుల్లోని కార్ నికోబార్ ఎయిర్ బేస్‌లో ఆధునీకరించిన రన్‌వేను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ శుక్రవారం ప్రారంభించారు. ఉదయం 11:30 గంటలకు కార్ నికోబార్ చేరుకున్న జనరల్ చౌహాన్‌కు, అండమాన్ నికోబార్ కమాండ్ కమాండర్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు.

వ్యూహాత్మక ప్రాముఖ్యత:

అంతర్జాతీయ వాణిజ్యానికి, ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన మలక్కా జలసంధి పై నేరుగా నిఘా ఉంచడానికి ఈ రన్‌వే ఎంతో ఉపయోగపడుతుంది. ఇది తూర్పు సరిహద్దులో భారతదేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఆధునికీకరణ వల్ల భారత వైమానిక దళం వేగవంతమైన ఆపరేషన్లను నిర్వహించగలుగుతుంది. విమానాల కదలికల కోసం 'ఏప్రాన్' ప్రాంతాలను కూడా విస్తరించారు. ఈ సదుపాయం ద్వారా వైమానిక దళం తక్కువ సమయంలోనే సుదూరలక్ష్యాలను ఛేదించే యుద్ధ విన్యాసాలను నిర్వహించడానికి వీలవుతుంది. శ్రీ విజయ పురం నుండి సుమారు 535 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్ నికోబార్ ద్వీపం, 2004 నాటి సునామీ సమయంలో తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపధ్యంలో దీనిని పునరుద్దరించడంతో పాటు ఆధునీకరించారు.

జాతీయ భద్రత:

"సిడిఎస్ పర్యటన అండమాన్ నికోబార్ దీవుల వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఇది భారత్ ప్రభుత్వ 'యాక్ట్ ఈస్ట్' విధానానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించిన 'సాగర్' విజన్‌కు అనుగుణంగా ఉంది," అని కమాండ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమ పర్యటనలో భాగంగా సిడిఎస్ ఒక స్టోరేజ్ ఫెసిలిటీని కూడా ప్రారంభిస్తారు.సునామీ మెమోరియల్‌ను సందర్శించి నివాళులర్పిస్తారు.

సాగర్ విజన్ అంటే,

సాగర్ అనేది హిందూ మహాసముద్ర ప్రాంతం విషయంలో భారతదేశం అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానం, సిద్ధాంతం. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రతిపాదించారు.సముద్ర ప్రాంతంలోని అందరికీ భద్రత, వృద్ధి లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతిని నెలకొల్పడం, సముద్ర దొంగతనాలు, ఉగ్రవాదం వంటి ముప్పుల నుండి సభ్య దేశాలను రక్షించడం దీని ప్రధాన ఊదేశ్యం.

సముద్ర వనరులను ఉపయోగించుకుంటూ, తీరప్రాంతంలోని దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం, పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండటం, ఒకరి సార్వభౌమాధికారాన్ని మరొకరు గౌరవించుకోవడం, సునామీలు లేదా తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ ప్రాంతంలోని దేశాలకు భారత్ తక్షణ సహాయం అందించడం వంటి ఆచరణలు ఇందులో భాగంగా ఉంటాయి.

క్లుప్తంగా చెప్పాలంటే, భారత్ తన పొరుగు దేశాలతో కలిసి ఎదగాలని, అందరికీ రక్షణ కల్పించాలని భావించే ఒక "సముద్ర సంబంధిత దౌత్య విధానం" ఈ సాగర్ విజన్.

మలక్కా జలసంధిపై భారత్ నిఘా: కార్ నికోబార్ వైమానిక స్థావరంలో కొత్త రన్‌వే సిద్ధం - Tholi Paluku