Let's talk: editor@tmv.in
మరో కుటుంబాన్ని మింగేసిన రోడ్డు ప్రమాదం - డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం

మరో కుటుంబాన్ని మింగేసిన రోడ్డు ప్రమాదం - డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం

Panthagani Anusha
22 సెప్టెంబర్, 2025

వాహనదారుల నిర్లక్ష్యం, రోడ్ల దుస్థితితో ఈ మధ్యకాలంలో తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఏకంగా కుటుంబాలే ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని ఘటనలు మరవకముందే తాజాగా మరో ఘోరం వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దసరా ముందు వచ్చే ప్రతి అమావాస్యకి పితృదేవతలను గుర్తు చేసుకుంటూ వారికి పిండప్రదానం చేసేందుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

పితృదేవతలకు పిండప్రదానం చేసేందుకు ఓ కుటుంబం కారులో తిరుపతి నుంచి పిఠాపురం బయలుదేరింది. మార్టూరు మండలం కోలలపూడి సమీపంలోని జాతీయ రహదారి వద్ద హఠాత్తుగా వీరి కారుకు ఓ కుక్క అడ్డురావడంతో డ్రైవర్ కుక్కను తప్పించే క్రమంలో వాహనాన్ని మలుపు తిప్పాడు. అతివేగంతో నియంత్రణ కోల్పోయిన కారు నేరుగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ఘటనలో కారులో ఉన్న వృద్ధ దంపతులు దామర్ల లక్ష్మణ్‌ (70), భార్య సుబ్బాయమ్మ (65)తో పాటు మనవడు హేమంత్‌ (25) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కాగా, వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మార్టూరు పోలీసులు వెల్లడించారు.

పండుగ ముందు ఆ కుటుంబంలో ముగ్గురి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది . ఈ విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన రోడ్లపై క్షణిక నిర్లక్ష్యం ఎంతటి ప్రాణ నష్టానికి కారణమవుతుందో మరోసారి గుర్తు చేసింది.

మరో కుటుంబాన్ని మింగేసిన రోడ్డు ప్రమాదం - డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం - Tholi Paluku