
మరో 65 మంది అభ్యర్థులను
జన్‌సురాజ్ పార్టీ బీహార్ ఎన్నికలకు సంబంధించి మరో 65 మంది కొత్త అభ్యర్థులను ప్రకటించింది. జాబితాలో 19 రిజర్వ్ సీట్లు (18 ఎస్సీ, 1 ఎస్టీ), 46 సాధారణ సీట్లు ఉన్నాయి. పార్టీ తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో వివిధ సామాజికవర్గాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పింది. రెండో జాబితాలో 14 మంది ఈబీసీ అభ్యర్థులు, 10 మంది ఓబీసీ అభ్యర్థులు, 11 జనరల్ అభ్యర్థులు, 14 మంది మైనారిటీ వర్గాల అభ్యర్థులు ఉన్నారు. సాధారణ సీట్లలో సమర్థవంతమైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా తాము సామాజిక న్యాయం చేస్తున్నామని ఆ పార్టీ చెప్పుకుంటున్నది. మొదటి అభ్యర్థుల జాబితా అక్టోబర్ 9న విడుదల అయ్యింది. అందులో 51 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో ఇతర పార్టీల కంటే ముందే ఉంది. ఎన్టీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపిణీ నిర్ణయించబడినప్పటికీ అభ్యర్థుల జాబితా ప్రకటించలేదు. మహాఘట్ బంధన్ కూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు జరగనేలేదు. అంతలోనే ప్రశాంత్ కిశోర్ పార్టీ అభ్యర్థులను తేల్చేయడం గమనార్హం.
జన్ సూరాజ్ పార్టీ సత్తా చూపగలదా?
జేఎస్‌పీని ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఆయన రాజకీయ వ్యూహాలలో ప్రావీణ్యం ఉంది. గతంలో ఆయన వివిధ రాజకీయ పార్టీలకు సలహాదారుగా పనిచేసి ఆయా పార్టీలను విజయతీరాలను చేర్చారు. అయితే సొంతంగా పార్టీ స్థాపించిన ఆయన ఎంత మేర సత్తా చూపగలరో వేచి చూడాలి. అభ్యర్థుల ఎంపికలో జేఎస్పీ ముందే ఉండడం, సామాజికన్యాయం పాటించడం వంటి అంశాలు కీలకంగా మారాయి.
ఇతర పార్టీలతో పోటీ పరిస్థితి
ఎన్డీయేలో బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ వంటి పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కూటమి సీట్లను పంచుకుని పోటీకి సిద్ధమయ్యింది. మహాఘట్‌బంధన్ ఇంకా పూర్తి సీట్ల పంపిణీ నిర్ణయం తీసుకోలేదు. జన్ సురాజ్ పార్టీ కూడా సామాజిక న్యాయాన్నే నమ్ముకున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు జనరల్ స్థానాల్లో సీట్లు కేటాయించామని చెబుతోంది. అయితే ముఖ్యంగా ఆయా వర్గాల ఓట్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి మహాఘట్ బంధన్ కూటమికి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీలను ఏకం చేసి లబ్ధి పొందాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో జన్ సురాజ్ పార్టీతో కాంగ్రెస్, ఆర్జేడీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన జేడీయూ సైతం కొన్ని బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకున్నది. ఆ పార్టీకి కొంత నష్టం వాటిల్ల అవకాశం ఉంది. అయితే ప్రశాంత్ కిశోర్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం ముందుకు తీసుకెళ్లడం, ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా రాజకీయ ఎత్తుగడలు మార్చడంలో దిట్ట. అందుకే ఆయనకు కొంత మద్దతు దక్కే అవకాశం ఉంది. అయితే ఎన్డీయే, మహాఘట్ బంధన్ మధ్య హోరాహోరీ పోటీ సాగితే అప్పుడు జన్ సరాజ్ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ కొన్ని నియోజకవర్గాల్లోనైనా త్రిముఖ పోరు ఉంటే అది ప్రశాంత్ కిశోర్ కు లాభమే. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
