
మరో యూట్యూబర్ అరెస్టు
దేశ భద్రతను దెబ్బతీయాలనే కుట్రలో యూట్యూబర్ ఒకరు పట్టుబడ్డారు. హర్యానాలోని పల్వాల్ జిల్లాకు చెందిన వసీం అక్రమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి సమాచారం అందజేస్తున్నాడనే ఆరోపణలపై అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మేవాట్ చరిత్రపై తరచుగా వీడియోలు రూపొందిస్తూ యూట్యూబ్‌లో పోస్ట్ చేసే అక్రమ్, గడచిన మూడు సంవత్సరాలుగా పాకిస్థానీ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడింది. అక్రమ్ ఫోన్‌లో అనుమానాస్పదమైన, నేరపూరిత సందేశాలను పోలీసులు గుర్తించారు. వాటిని మరింతగా విశ్లేషించేందుకు ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.
పాకిస్థాన్ ఏజెంట్లకు అతడు ఏ రకమైన సమాచారం అందజేశాడో, దేశ భద్రతకు ముప్పు కలిగించేంత వివరాలున్నాయో? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత భద్రతా సంస్థల సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తూ దేశ ద్రోహానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతుండటంతో, అక్రమ్‌ను కఠినంగా విచారించనున్నట్లు వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది.
గతంలో అరెస్టైన యూట్యూబర్స్
ఇదే తరహా కేసులు గతంలోనూ వెలుగుచూశాయి. ఇటీవల హర్యానాలోనే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె “ట్రావెల్ విత్ జో” అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ, పాక్ హైకమిషన్ వీసా డెస్క్ ద్వారా ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగించినట్లు విచారణలో తేలింది. ఇదే కేసులో పంజాబ్‌లోని రోపర్‌కు చెందిన యూట్యూబర్ జస్బీర్ సింగ్‌ను కూడా అరెస్ట్ చేశారు. అతను “జాన్ మహల్ వీడియో” ఛానెల్ నడుపుతూ, పాక్ ఏజెంట్లను పలుమార్లు కలిశాడని, సున్నితమైన సమాచారం అందజేశాడని అధికారులు తెలిపారు.
ఇక గత ఏడాదిన్నర కాలంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 12 మందిని గూఢచార నెట్‌వర్క్‌లో భాగమని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో యూట్యూబర్లు, వ్యాపారులు, విద్యార్థులు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారని విచారణలో తేలింది. నౌమేన్ ఎలాహి అనే వ్యక్తిపై “ఆపరేషన్ సిందూర్” పేరిట హర్యానా పోలీసులు ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఒకరి తర్వాత ఒకరు బహిర్గతమవుతున్న ఈ కేసులు దేశ భద్రతకు ఎంతటి ముప్పు ఏర్పడుతుందో సూచిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికలను వాడుకుంటూ ఐఎస్ఐ ఏజెంట్లు నెట్వర్క్ విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిపై కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
