
మరో యుద్ధం ఆరంభం
మరో యుద్ధం మొదలుకానుందనే శబ్దం గాలిలో వినిపిస్తోంది. ప్రపంచం మరోసారి రక్తం చూసే రోజులు దగ్గరగా వస్తున్నాయి. ట్రంప్ తన కుర్చీలో కూర్చొని గర్జిస్తున్న ఈ సమయంలో, వెనిజులా నుంచి బయలుదేరిన ఓ పడవ కరేబియన్ సముద్రంలో పేలిపోయింది. అమెరికా బాంబులు గర్జించగా ఆ పడవలో ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు, మంటలు, సముద్రపు నీటిలో కలిసిపోయిన రక్తం.. ఇప్పుడు కొత్త తుపానుకు సంకేతాలు ఇస్తోంది. ఇది నిజంగా డ్రగ్స్ మాఫియాపై యుద్ధమా లేదా మరొక పెద్ద యుద్ధానికి పునాదా అనే అనుమానం అందరిని కలవరపెడుతోంది. అమెరికా గతంలోనే 4500 మంది సైనికులు, 7 యుద్ధ నౌకలను వెనిజులా తీరాలకు పంపింది. ట్రంప్ ప్రపంచ వేదికపై శక్తి ప్రదర్శన చేస్తున్నారు.. కానీ ఈ ప్రదర్శన ఎక్కడికి దారి తీస్తుందో అన్న సందేహం ప్రపంచం అంతటా భయాన్ని నింపుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరేబియన్ సముద్రంలో జరిగిన ఐదో పెద్ద దాడి ఇది
అమెరికా ఏమో తాము దాడి చేస్తుందని మాదకద్రవ్యాల బోటు అని చెబుతుంది కానీ.. ఇప్పటివరకు ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదు. ఇటు పెంటగాన్ అధికారులు కూడా ఏ చట్టం ఆధారంగా ఈ దాడి చేశామో ప్రజలకు చెప్పడానికి తడబడుతున్నారు. నిపుణులు ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని హెచ్చరిస్తున్నారు. చరిత్రలో 1898లో మైన్ యుద్ధానికి కారణమైనట్టే, ఇప్పుడు ఈ పేలుడు కూడా కొత్త యుద్ధానికి మంటలు రగిలిస్తుందేమో అన్న భయం పాకుతోంది. వెనిజులా అధ్యక్షుడు మడురో అమెరికాను ఓ సామ్రాజ్యవాద దేశంగా ముద్ర వేస్తూ, తమ దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నామని గర్జిస్తున్నారు.
అయితే నిజానికి వెనిజులా పెద్దగా డ్రగ్స్ ఉత్పత్తి చేసే దేశం కాదు, అయినా అమెరికా కోపాన్ని చూపించడానికి ఈ కారణాన్ని వాడుకుంటోందని నిపుణులు అంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం వెనిజులాపై కఠిన చర్యలు తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటన్నది ప్రపంచానికి ప్రశ్నగా మారింది. అధికారికంగా అమెరికా వెనిజులాను డ్రగ్స్ అక్రమ రవాణా కేంద్రంగా చూపిస్తోంది. ఈ కారణంతో అమెరికా నౌకాదళాన్ని కరీబియన్ ప్రాంతంలో మోహరించింది. కానీ వెనిజులా చమురు సంపదను చూసినప్పుడు అసలు ఉద్దేశ్యం డ్రగ్స్ మాత్రమే కాదని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనిజులాకే ఉన్నాయి. అందుకే అమెరికా ఆ దేశంపై దృష్టి పెట్టిందని.. దానికి సాకుగా డ్రగ్స్ అనే పదాన్ని వాడుకుంటుందన్న ఆరోపణలున్నాయి.
మరోవైపు కరేబియన్ సముద్రంలో అమెరికా యుద్ధనౌకలు వరుసగా నిలబడి ఉన్నాయి. మిసైల్ డిస్ట్రాయర్లు, అణు జలాంతర్గాములు, ఇంటెలిజెన్స్ విమానాలు అన్నీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇది కేవలం డ్రగ్స్ ఆపరేషన్ కాదని, కొత్త గన్‌బోట్ డిప్లమసీ ప్రారంభమైందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో వెనిజులా అధ్యక్షుడు మడురో తన దేశం 45 లక్షల మిలీషియాతో సిద్ధంగా ఉందని గర్జిస్తున్నారు. కానీ ఆ సంఖ్య వాస్తవానికి కేవలం రాజకీయ నినాదమే అని ప్రపంచం గుర్తిస్తోంది. ఇక ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ సర్వత్రా కనిపిస్తోంది. ఒకవేళ ఇది మరో యుద్ధానికి కారణమైతే మాత్రం సామాన్యులు బలి అవ్వక తప్పదు.
