Let's talk: editor@tmv.in
మరోసారి దీదీ వైపు బెం‘గాలి’ వీచేనా?

మరోసారి దీదీ వైపు బెం‘గాలి’ వీచేనా?

Pinjari Chand
19 మార్చి, 2026

పశ్చిమ బెంగాల్‌లో వరుసగా 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కఠిన పోరాటానికి సిద్ధమైంది. నాలుగోసారి తమ ప్రభావాన్ని చాటాలని ప్రయత్నం చేస్తోంది. అందుకోసం శాయశక్తులా శ్రమిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలో ఉన్న ఈ పార్టీ ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత (యాంటి-ఇంకంబెన్సీ), అంతర్గత అసంతృప్తి, ఓటరు జాబితా సవరణలపై వివాదం వంటి అంశాలు, మరోవైపు బలమైన ప్రతిపక్ష సవాళ్లను ఎదుర్కొంటూ ఎన్నికల రంగంలోకి దిగుతోంది. దీంతో ఈ ఎన్నికలు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయి. ఇంకోవైపు అధికారం సాధించాలనే తపనతో బీజేపీ అలుపెరుగని పోరాటం చేస్తోంది.

సంక్షేమ పథకాలే ప్రధాన బలం

టీఎంసీ ఎన్నికల వ్యూహంలో ప్రధానంగా సంక్షేమ పథకాలే ఆధారం. ‘లక్ష్మీర్ భండార్’, ‘కన్యాశ్రీ’, ‘స్వస్థ్య సాథీ’ వంటి పథకాల ద్వారా మహిళలు, గ్రామీణ వర్గాలు, పేదలతో బలమైన అనుబంధాన్ని పార్టీ ఏర్పరుచుకుంది. ఈ పథకాల వల్ల పెద్ద ఎత్తున లబ్ధిదారుల వర్గం ఏర్పడిందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

బెంగాలీ ఆత్మగౌరవం పై దృష్టి

ఈసారి టీఎంసీ ప్రచారంలో బెంగాలీ సంస్కృతి, భాష, ప్రాంతీయ గౌరవం ప్రధాన అంశాలుగా మారాయి. “బంగ్లా నిజర్ మేయెకే చాయ్( బెంగాల్ తన సొంత కూతురినే కోరుకుంటోంది) వంటి నినాదాలతో పాటు, కేంద్రంపై విమర్శలు చేస్తూ ప్రాంతీయ స్వాభిమానాన్ని ముందుకు తెస్తోంది.

బీజేపీ సవాల్ – ధ్రువీకరణ రాజకీయాలు

ఇక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ ఎన్నికలను తీవ్రమైన పోటీగా మార్చింది. ముఖ్యంగా హిందూ ఓటర్లను ఏకం చేయడం, మైనారిటీలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలతో టీఎంసీపై నిరంతరం ఎదురుదాడి చేస్తోంది. దీనికి ప్రతిస్పందనగా టీఎంసీ సంక్షేమం + బెంగాలీ గుర్తింపు అనే మిశ్రమ వ్యూహాన్ని అవలంబిస్తోంది.

భారీగా అభ్యర్థుల మార్పులు

అంటి-ఇంకంబెన్సీని తగ్గించేందుకు టీఎంసీ భారీ స్థాయిలో అభ్యర్థులను మార్చింది. మొత్తం 294 స్థానాల్లో 291కి అభ్యర్థులను ప్రకటించగా, అందులో 74 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పోటీ నుంచి తప్పించింది. ఇది ‘నియంత్రిత మార్పు’గా పార్టీ పేర్కొంటోంది. అలాగే బెంగాల్‌లో దీర్ఘకాలిక పాలన వల్ల స్థానిక స్థాయిలో అసంతృప్తి, అవినీతి ఆరోపణలు, వర్గపోరాటాలు పార్టీకి సవాల్‌గా మారాయి. ఇవి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది.

ఓటరు జాబితా సవరణ వివాదం (ఎస్ఐఆర్)

ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచే మరో అంశం ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్‌ఐఆర్). ఓటరు జాబితాల్లో భారీ ఎత్తున తొలగించారని టీఎంసీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా తమకు మద్దతు ఉన్న ప్రాంతాల్లో ఓటర్లను తొలగించారని పార్టీ ఆరోపిస్తోంది. ఈ వివాదం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

2021 సీన్ రీపిటవుతుందా?

2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ ఎత్తున ప్రచారం చేసినప్పటికీ, టీఎంసీ 215కు పైగా సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది. ఆ విజయంతో మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా బలమైన ప్రాంతీయ నాయకురాలిగా గుర్తింపు పొందారు. కానీ ఈసారి పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సుదీర్ఘకాలం అధికారంలో ఉండడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, అలాగే బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో బెంగాల్‌పైనే దృష్టి కేంద్రీకరించడం, ఎస్‌ఐఆర్ వివాదం ఇలాంటి అంశాల మధ్య టీఎంసీ తన సంక్షేమ పథకాలు, బలమైన సంస్థాగత వ్యవస్థ, ప్రాంతీయ భావజాలంతో మరోసారి గెలుపు సాధించగలదా అన్నది ఆసక్తిగా మారింది.

మరోసారి దీదీ వైపు బెం‘గాలి’ వీచేనా? - Tholi Paluku