
మార్వాడీ గోబ్యాక్ అనడం కరెక్ట్ కాదు - మనమంతా భారతీయులు
మార్వాడీ గోబ్యాక్ అనే నినాదం కరెక్ట్ కాదని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. మనమంతా భారతీయులమని పేర్కొన్నారు. ‘మార్వాడీ గోబ్యాక్’ నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మైనంపల్లి కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆల్‌మైసన్ విల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇలాంటి నినాదాలు దేశ సమైక్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో ప్రతి పౌరుడికి ఏ రాష్ట్రంలోనైనా స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉందన్నారు.
భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తోందని, బహుళ సంస్కృతుల దేశంగా ఉన్న భారత్‌లో ఈ విధమైన ప్రాంతీయ, జాతిపరమైన విభజనలు హానికరమైనవని పేర్కొన్నారు. అలాగే విదేశాల్లో భారతీయులు ఎలా బతుకుతున్నారో, ఎలా ఇతర దేశాల్లో స్థిరపడుతున్నారో వివరించారు. మన భారతీయులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి ఎన్నో దేశాల్లో జీవిస్తున్నారని, అక్కడ వారిని ఆ దేశాల ప్రజలు అంగీకరిస్తున్నారని, అలాగే మన దేశంలో కూడా ప్రతి పౌరుడికి జీవించే స్వేచ్ఛ ఉందని తెలిపారు. మార్వాడీలైనా, బెంగాలీలైనా, ఉత్తరాది ప్రజలైనా భారతదేశపు హక్కుదారులేనని, వారిని వేరుచేయాలన్న ప్రయత్నం మానుకోవాలని మైనంపల్లి హన్మంతరావు సూచించారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసే నాయకులు ప్రజల్లో భయాందోళనలు కలిగించి రాజకీయంగా లబ్ది పొందాలనుకుంటున్నారని ఇది చాలా ప్రమాదకరమని, ప్రజలంతా సమాన హక్కులతో జీవించాలని భావించే తాను ఇటువంటి నినాదాలకు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. అలాగే కులాలు, మతాల వారిగా విడిపోతే నష్టపోయేది దేశ ప్రజలేనని అన్నారు. అందరూ కలిసి సమైక్యంగా ఉందామని మైనంపల్లి పిలుపు నిచ్చారు.
