
మరణంలోనూ బిడ్డను వీడని తల్లి ప్రేమ..
తల్లి హృదయం ఎంత కరుణతో నిండి ఉంటుందో అందరికీ తెలిసిందే. సంతానం పట్ల తల్లి చూపించే ఆప్యాయత, త్యాగం ఎంత గొప్పదో ఈ సంఘటన మరోసారి స్పష్టంచేసింది. పుట్టుకతోనే మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న కుమారుడిని చూసుకుంటూ తల్లి సాక్షి చావ్లా భర్తకు భారం కాకూడదనే భావనతో కుమారుడితో కలిసి ప్రాణాలు తీసుకుంది.
మృతురాలు సాక్షి చావ్లా, భర్త దర్పణ్ చావ్లా (చార్టర్డ్ అకౌంటెంట్)తో కలిసి గ్రేటర్ నోయిడాలోని ఏస్ సిటీ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. వారికి ఉన్న ఏకైక కుమారుడు దక్ష (11) చిన్నప్పటి నుంచే మానసిక వికలాంగతతో బాధపడుతున్నాడు. ఎన్నో వైద్య ప్రయత్నాలు చేసినా పరిస్థితి మెరుగుపడలేదు.
ఈ పరిస్థితిని తట్టుకోలేక సాక్షి శనివారం సాయంత్రం కుమారుడితో కలిసి అపార్ట్మెంట్ 13వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయాలు తగలడం తో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఆ సమయంలో భర్త దర్పణ్ ఇంట్లోనే ఉండగా, బాల్కనీలోకి పరుగెత్తి వచ్చి రక్తపు మడుగులో భార్య, కుమారుడిని చూసి కుప్పకూలిపోయాడు.
అయితే సూసైడ్ కి ముందు సాక్షి రాసిన లెటర్ అందరికీ కన్నీళ్లు పెట్టిస్తుంది. సాక్షి రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో, “మా కారణంగా మీ జీవితం నాశనం కాకూడదు. ఇకమీదట మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. మా మరణానికి ఎవరూ కారణం కాదు” అని పేర్కొంది కుమారుడి సమస్యల వల్ల మానసిక వేదనకు భరించలేని బాధను ఆడుకుంటున్నానని, భర్త కష్టాలు చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
