Let's talk: editor@tmv.in
మార్చి నాటికి మావోయిస్టు రహిత భారతం

మార్చి నాటికి మావోయిస్టు రహిత భారతం

FL - SUNL
18 సెప్టెంబర్, 2025

ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో హింసాత్మక సాయుధ పోరాటానికి ప్రసిద్ధి చెందిన మావోయిస్టు పార్టీ (సీపీఐ మావోయిస్టు) ఆయుధాలను తాత్కాలికంగా వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు విడుదలైన లేఖ ఇటీవల వెలుగులోకి వచ్చింది. హిందీలో జారీ చేసిన ఈ లేఖలో, పార్టీ అధికార ప్రతినిధి అభయ్ (మల్లోజుల వేణుగోపాల్ రావు అనే అసలు పేరుతో పోలిట్బ్యూరో సభ్యుడు) పేరిట, ప్రపంచవ్యాప్తంగా మారిపోతున్న పరిస్థితులు, దేశంలోని మార్పులను పరిగణనలోకి తీసుకుని సాయుధ పోరాటానికి విరామం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చుతామని అనేకసార్లు ప్రకటించిన నేపథ్యంలో, ఆపరేషన్ కగార్లో భాగంగా జరిగిన వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టు పార్టీని తీవ్రమైన దెబ్బతీశాయి. మే 21న చోక్కీ మార్హ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు (బసవరాజు)తో పాటు 28 మంది కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. ఇటీవల జార్ఖండ్లోని హజారీబాగ్లో మరో ముగ్గురు మావోయిస్టులు, ఛత్తీస్గఢ్లోని గరియాబాండ్లో మోడెం బాలకృష్ణ (మనోజ్) తదితరులు ఎన్కౌంటర్ అయ్యారు.

వరుస ఎదురుదెబ్బలు తగలడంతో పాటు, భారీ సంఖ్యలో మావోయిస్టులు సరెండర్ అవుతున్నారు. తెలంగాణలోనూ ఇటీవల పోతుల పద్మావతి (సుజాత) వంటి సీనియర్ నేతలు లొంగిపోయారు.

ఈ నేపథ్యంలో అభయ్ పేరుతో విడుదల చేసిన లేఖలో, ఈ ఏడాది మార్చి నుంచి ప్రభుత్వంతో శాంతి చర్చలకు నిజాయితీగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. బసవరాజు మరణానికి ముందే ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి నాయకులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని చేసిన విజ్ఞప్తులను గౌరవిస్తూ, సాయుధ పోరాటాన్ని విరమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

అయితే, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మావోయిస్టు నేతలు, కార్యకర్తలతో చర్చించుకుని తుది నిర్ణయానికి రావాలంటే కనీసం ఒక నెల సమయం కావాలని, ఆ కాలంలో ప్రభుత్వం ఆపరేషన్ కగార్, ఎన్కౌంటర్లు, గాలింపు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని షరతు విధించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మీడియా లేదా ఇతర మార్గాల ద్వారా తెలిపాలని, పెద్దలతో వీడియో కాల్లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. మొదటిసారిగా అభయ్ ఫోటో,ఈ-మెయిల్ఐడీ(nampet(2025)@gmail

.com), ఫేస్బుక్ పేజీ (nampetalk) వంటి వివరాలను విడుదల చేయడం గమనార్హం. మద్దతుదారులు, లెఫ్టిస్టు సంస్థలు, కార్యకర్తల అభిప్రాయాలను కోరారు.

ఈ లేఖ మావోయిస్టు, పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. అయితే, ప్రభుత్వం లేఖ వెనుక నిజానిజాలను ఆరా తీస్తోంది. ఛత్తీస్గఢ్ డిప్యూటీసీఎం,హోంమంత్రివిజయ్శర్మ"లేఖలోకొత్తఅంశాలుఉన్నాయి,వాస్తవికతను పరిశీలిస్తున్నామని" చెప్పారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ లేఖలోని అంశాలను విశ్లేషిస్తున్నామని, మావోయిస్టులు సరెండర్ చేసి పునరావాసం పొందాలని స్పష్టం చేశారు. మే 10న ముందు ఒక ప్రకటన విడుదలైందని, కానీ ప్రభుత్వం స్పందన లేకపోవడంతో ఆలస్యమైందని మావోయిస్టులు చెప్పారు.

తొలిసారి మావోయిస్టులు ఇలా ముందుకు అడుగేయడం ఆపరేషన్ కగార్ విజయానికి సంకేతంగా కనిపిస్తోంది. మావోయిస్టులు భవిష్యత్తులో ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను గౌరవించి, చర్చలకు పిలుస్తుందా లేక ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తుందా అనేది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.

మార్చి నాటికి మావోయిస్టు రహిత భారతం - Tholi Paluku