Let's talk: editor@tmv.in
మేయర్‌కు 'స్మార్ట్'గా చెక్

మేయర్‌కు 'స్మార్ట్'గా చెక్

FL - YUGDR
26 సెప్టెంబర్, 2025

అర్థం లేని ఆవేశాన్ని అహంకారాన్ని ప్రదర్శిస్తూ అభాసుపాలవుతున్న జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావుకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్ ప్రాభవానికి క్రమంగా చెక్ పెడుతుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటమికి ఆయన వ్యవహారశైలే కారణమని టీడీడీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలను పరిశీలిస్తే మేయర్‌కు కష్టకాలం వచ్చేసిందని అనిపిస్తోంది.

తాజాగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ పరిధిలో తనకు తెలియకుండా హాస్టల్ భవనాలకు టెండర్లను పిలవడంపై కార్పొరేషన్ మేనేజర్ ఆనంద్‌పై మేయర్ పీలా శ్రీనివాసరావు మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ఆ టెండర్లను రద్దు చేస్తూ పాలకవర్గ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే మేయర్ ప్రయత్నాలను చిత్తుచేస్తూ.. గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ (జీవీఎస్‌సీసీఎల్) స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అంతేకాకుండా జీవీఎస్‌సీసీఎల్ మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులతో పాటు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ప్రాజెక్టు పనులను కూడా పర్యవేక్షిస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. తద్వారా మేయర్ నిర్ణయాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కమిషనర్ లెక్కే చేయడం లేదు

వాస్తవానికి జీవీఎంసీ కమిషనర్‌గా కేతన్ గార్గ్ తనదైన ముద్రతో ముందుకెళుతున్నారు. కమిషనర్‌గా ఆయన వచ్చిన సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలు, టీడీఆర్ వ్యవహారాల్లోనూ కమిషనర్ సూటిగా వ్యవహరిస్తుండటం మేయర్ ఆగ్రహానికి కారణమన్న అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటు న్నారంటూ కమిషనర్‌పై మేయర్ గుర్రుగా ఉన్నారు. ఈ విషయమై తన అనుయాయుల వద్ద ఆయన బయటపడిన సందర్భాలు ఉన్నట్టు జీవీఎంసీలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణాలపై జీవీఎస్సీసీఎల్ ద్వారా సీఈవో హోదాలో టెండర్లను కమిషనర్ ఆహ్వానించారు. ఈ విషయం తనకు తెలియదంటూ మేయర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు టెండర్లను రద్దు చేస్తున్నట్టు కూడా పరోక్షంగా కొన్ని మీడియాల్లో కథనాల ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా కమిషనర్ వైఖరితో మేయర్‌కు ఇబ్బందిగా మారుతోందంటూ లీకులిచ్చారు. తద్వారా కమిషనర్‌పై నేరుగా యుద్ధాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జీవీఎస్సీసీఎల్ టెండర్లను రద్దు చేయడమే కాకుండా ఏకంగా బీచ్ రోడ్‌లోని సంస్థ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. తనదే పైచేయి అన్నట్టుగా మేయర్ వ్యవహరించారు. తాజాగా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులతో మేయర్‌కు 'స్మార్ట్'గా చెక్ పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మేయర్‌పై వ్యతిరేకత

గత వైసిపి పాలనాకాలంలో వారితో కుమ్మక్కై వాటాల అందుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న పీలా శ్రీనివాసరావు మేయర్‌గా తన ముద్ర వేయడంలో విఫలమవుతున్నారు. తాను ప్రతిపక్షంలో ఉండగా చికెన్ వ్యర్ధాల విషయంలో అల్లరి పాలైన పీలా శ్రీనివాసరావు చికెన్ వ్యర్థాల విషయంలోనూ కమిషనర్‌పై నెపం పెట్టే ప్రయత్నం చేయటం తిప్పికొట్టింది. చికెన్ వ్యర్థాల తరలింపులో పట్టుబడిన వారిపై కేసులు పెట్టకుండా కమిషనర్ అడ్డుపడుతున్నారంటూ మేయర్ వర్గం ప్రచారం చేసింది. వాస్తవానికి కేతన్ గార్గ్ కమిషనర్‌గా వచ్చిన తర్వాత చికెన్ వ్యర్థాల తరలింపునకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి కాపులుప్పాడకు తరలించేలా చూస్తున్నారు. దీంతో ఈ ప్రచారం కాస్త విఫలమైంది. అయితే ఏ టెండర్లను మేయర్ రద్దుచేసాడో... అవే టెండర్లను జీవీఎస్సీసీఎల్ ద్వారానే పిలిచేందుకు అనుమతిస్తూ తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తద్వారా మేయర్ పీఠానికి తాము ఇస్తున్న గౌరవం ఎంత మేర ఉందనే విషయాన్ని సూటిగా అర్థమయ్యేలా చెప్పినట్టు ఉందన్న అభిప్రాయం జీవీఎంసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తంగా మేయర్ అధికారాలకు ముప్పు వచ్చేలా తాజా నిర్ణయం ఉందన్న అభిప్రాయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

బడ్డీల తొలగింపు తెలియదు

విశాఖలో పెద్ద చర్చనీయాంశమైన అక్రమ బడ్డీల తొలగింపు విషయంలో మేయర్ పాత్ర నామమాత్రమే. విచిత్రంగా కార్పొరేటర్‌తో కలిసి మేయర్ పీలా శ్రీనివాసరావు విహారయాత్రగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యయన యాత్రకు వెళ్ళినప్పుడే వ్యూహాత్మకంగా బడ్డీల తొలగింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మొత్తం వ్యవహారంలో మేయర్ గురించి పట్టించుకున్న వారే లేకపోవడం జీవీఎంసీలో ఆయన స్థాయిని తేటతెల్లం చేస్తోంది.

మేయర్‌కు 'స్మార్ట్'గా చెక్ - Tholi Paluku