Let's talk: editor@tmv.in
మయన్మార్, థాయ్‌లాండ్ సరిహద్దులో చిక్కుకున్న హైదరాబాదీ యువకుడు

మయన్మార్, థాయ్‌లాండ్ సరిహద్దులో చిక్కుకున్న హైదరాబాదీ యువకుడు

Gaddamidi Naveen
24 జనవరి, 2026

హైదరాబాద్‌కు చెందిన మీర్ సజ్జాద్ అలీ మయన్మార్, థాయ్‌లాండ్ సరిహద్దు ప్రాంతంలో అక్రమంగా నిర్బంధించబడి ఉన్నట్లు వెలుగులోకి రావడంతో ఆయన కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొంది. సజ్జాద్ అలీ తల్లి నాజియా ఫాతిమా తన కుమారుడిని సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలకు విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగం పేరిట మోసం - బందీగా యువకుడు

శుక్రవారం మీడియాతో నాజియా ఫాతిమా మాట్లాడుతూ, ఆరు నెలల క్రితం నా కుమారుడు విదేశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. ఒకటిన్నర నెలల తర్వాత అతనితో ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. రెండు నెలల తరువాత అతను ఒక్కసారిగా ఫోన్ చేసి తన పరిస్థితి చెప్పాడు. థాయ్‌లాండ్‌లో ఉద్యోగ వీసాలు ఇస్తామని చెప్పి తీసుకెళ్లారని, అక్కడికి చేరుకున్న తర్వాత కళ్లకు గంతలు కట్టి బలవంతంగా పనిచేయిస్తున్నారని చెప్పాడు. సైన్యం అక్కడికి వచ్చినప్పటి నుంచి తన వద్ద ఫోన్, బ్యాగ్ కూడా లేవని అన్నాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని వెంటనే రక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

అసదుద్దీన్ ఓవైసీ జోక్యం

ఈ ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. మయన్మార్–థాయ్‌లాండ్ సరిహద్దులో కనీసం 16 మంది భారతీయులు అక్రమంగా బంధించబడ్డారని, వారిలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ఉన్నారని తెలిపారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసి వారిని అక్కడికి తరలించి బానిసలుగా పనిచేయిస్తున్నారని చెప్పారు. రోజుకు 18 నుంచి 20 గంటల పాటు పని చేయిస్తూ, శారీరకంగా హింసిస్తున్నారని, పాస్‌పోర్టులు, మొబైల్ ఫోన్లు, వైద్య సదుపాయాలు కూడా ఇవ్వడం లేదని ఒవైసీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. మిర్ సజ్జాద్ అలీ ప్రస్తుతం ఒస్మాన్ నగర్ నివాసిగా గుర్తించబడినట్లు, ఆయనతో పాటు మౌలా అలీ, బంజారా హిల్స్ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని విదేశాంగ మంత్రిని కోరారు.

ఇదే అంశంపై బీజేపీ నేత ఎన్వీ సుభాష్ మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా పెద్ద వ్యాపారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, అధిక ఆదాయం ఆశ చూపించి ప్రజలను మోసం చేసి విదేశాలకు పంపుతున్నారని, ప్రస్తుతం 16 మంది వరకు ఈ ఉచ్చులో చిక్కుకున్నారని, వారిలో 4 నుంచి 5 మంది హైదరాబాద్‌కు చెందినవారేనని తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.