Let's talk: editor@tmv.in
మయన్మార్ చెర నుంచి మరో 55 మంది ఏపీ వాసుల విడుదల

మయన్మార్ చెర నుంచి మరో 55 మంది ఏపీ వాసుల విడుదల

Shaik Mohammad Shaffee
22 నవంబర్, 2025

మయన్మార్‌లోని సైబర్‌ నేరగాళ్ల ముఠాల చెరలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో 55 మంది సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. అధిక జీతాలు ఇచ్చే ఉద్యోగాల పేరుతో మోసపోయిన ఈ బాధితులను భారత ప్రభుత్వం రక్షించింది. రక్షించిన వారిని ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలించారు. మయన్మార్‌ నుంచి స్వదేశానికి తీసుకువచ్చిన మొత్తం 370 మంది భారతీయుల్లో, ఈ 55 మంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు.

వీరిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలకు చెందినవారు ఉండగా, వీరికి తోడుగా 8 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ఏపీ భవన్ బృందం వారిని భారత ప్రభుత్వ అధికారుల నుండి స్వీకరించి సురక్షితంగా ఏపీ భవన్‌కు తీసుకువచ్చింది. వారందరికీ వెంటనే తాత్కాలిక వసతి, ఆహరం అందించింది.

వీరంతా వాట్సాప్, టెలిగ్రామ్ లింక్‌ల ద్వారా ప్రచారం చేసిన నకిలీ ఉద్యోగాల ప్రకటనలకు మోసపోయి, మయన్మార్‌లోని ఒక సైబర్ క్రైమ్ కేంద్రంలో చిక్కుకుపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరు మయన్మార్-థాయ్‌లాండ్ సరిహద్దు పట్టణమైన మ్యావాడిలోని కేకే పార్క్ నుంచి రక్షించబడ్డారని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ తెలిపారు.

మయన్మార్‌లో వారి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నందున వారి వద్ద డబ్బు లేకపోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నందున వారి తదుపరి ప్రయాణ సమయంలో ఇతర ఖర్చులకు సహాయంగా ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.1,000 సహాయం అందించింది.

అంతేగాక వారు వారి స్వస్థలాలకు చేరేందుకు వీలుగా వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి అత్యవసర కోటా విడుదల కోసం ఉత్తర రైల్వే అధికారులతో కూడా ఏపీ భవన్ అధికారుల బృందం సమన్వయం చేస్తోంది. అందరూ అతి త్వరగా వారి వారి గమ్యస్థానాలకు చేరేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారు.

ఈ ఆపరేషన్‌తో ఏపీ ప్రభుత్వం మయన్మార్ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ నుండి 79 మంది స్వదేశానికి తిరిగి వచ్చిన వారిని వారి ఇళ్లకు చేరుకోవడానికి విజయవంతంగా సహాయం చేసింది. తమను సురక్షితంగా స్వదేశానికి తరలించినందుకు, ఢిల్లీలో అందించిన అసాధారణ సంరక్షణకు చర్యలకు భారత ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 55 మంది సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మయన్మార్ చెర నుంచి మరో 55 మంది ఏపీ వాసుల విడుదల - Tholi Paluku