Let's talk: editor@tmv.in
మయన్మార్ ఎన్నికలు: మొదటి విడతలో సైనిక మద్దతు ఉన్న పార్టీదే హవా!

మయన్మార్ ఎన్నికలు: మొదటి విడతలో సైనిక మద్దతు ఉన్న పార్టీదే హవా!

Shaik Mohammad Shaffee
31 డిసెంబర్, 2025

మయన్మార్ దేశంలో ఐదేళ్ల తర్వాత జరుగుతున్న సాధారణ ఎన్నికలలో మొదటి విడత ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారికంగా ఎన్నికల సంఘం ఫలితాలు ప్రకటించకపోయినప్పటికీ, సైన్యం అండతో నడుస్తున్న 'యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ' (యూఎస్‌డీపీ) భారీ విజయం సాధించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మూడు విడతల్లో ఎన్నికలు

మయన్మార్‌లో కొనసాగుతున్న సాయుధ పోరాటాల కారణంగా ఈ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తున్నారు. తొలి దశ ఓటింగ్ ఆదివారం 330 పట్టణాల (టౌన్‌షిప్‌లు)లో 102 ప్రాంతాల్లో జరిగింది. మిగతా రెండు దశలు జనవరి 11, జనవరి 25న జరగనున్నాయి. అయితే భద్రతా సమస్యల కారణంగా 65 పట్టణాల్లో ఎన్నికలు జరగడం లేదు.

ముందంజలో యూఎస్‌డీపీ

సైన్యం మద్దతు ఉన్న యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత మాట్లాడుతూ, తొలి దశలో పోటీ జరిగిన 102 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ 88 స్థానాలు గెలుచుకున్నట్టు తెలిపారు. అయితే ఆయనకు అధికారికంగా వివరాలు వెల్లడించే అనుమతి లేకపోవడంతో పేరు వెల్లడించలేదు.

మయన్మార్‌లో రెండు సభలతో కూడిన జాతీయ పార్లమెంట్ ఉంది. మొత్తం 664 స్థానాలు ఉన్నాయి. ఈ రెండింటిలో కలిపి మెజారిటీ సాధించిన పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం పొందుతుంది. అయితే రాజ్యాంగం ప్రకారం సైన్యానికి ఇప్పటికే రెండు సభలలోనూ 25 శాతం స్థానాలు కేటాయించారు.

ఈ ఎన్నికల తుది ఫలితాలు జనవరి చివరినాటికి ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తొలి దశ ఫలితాల మొత్తాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. అయితే స్థానిక పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు వివరాలు ప్రకటించారు. యూఎస్‌డీపీ నేత తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రాల శాసనసభల్లో కూడా పోటీ జరిగిన స్థానాల్లో సుమారు 85 శాతం స్థానాల్లో తమ పార్టీ ఆధిక్యంలో ఉందని చెప్పారు. అయితే తుది ఫలితాలు రెండో, మూడో దశల తర్వాతే తెలుస్తుందని అన్నారు.

కీలక స్థానాల్లో విజయం

రాజధాని నయ్‌పీడాలోని ఎనిమిది పట్టణాలన్నింటిలోనూ తమ పార్టీ గెలిచిందని ఆయన తెలిపారు. అక్కడ సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో యూఎస్‌డీపీకి మద్దతు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో మాజీ జనరల్స్ కూడా అభ్యర్థులుగా పోటీ చేశారు.

ఈ ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ శాసనసభల కోసం 57 పార్టీల నుంచి 4,800 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉన్న పార్టీలు మాత్రం కేవలం ఆరు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. వీటిలో యూఎస్‌డీపీ అత్యంత బలమైన పార్టీగా కనిపిస్తోంది.

తగ్గిన ఓటర్ల సంఖ్య

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగినవారు 2.4 కోట్ల మంది మాత్రమే. ఇది 2020 ఎన్నికలతో పోలిస్తే సుమారు 35 శాతం తక్కువ. సాయుధ ఘర్షణల కారణంగా ప్రజలు వలస వెళ్లడం, పోరాట ప్రాంతాల్లో ఎన్నికలపై ఆంక్షలు విధించడం ఇందుకు కారణమని తెలిపింది. తొలి దశలో ఎంతమంది ఓటు వేశారనే వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

విపక్షాల ఆందోళన

ప్రతిపక్ష పార్టీలు, ఉద్యమ సంస్థలు ఈ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలను పిలుపునిచ్చాయి. మానవ హక్కుల సంఘాలు, ప్రతిపక్ష వర్గాలు ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా జరగడం లేదని ఆరోపిస్తున్నాయి. అధికారాలు సైన్యాధినేత సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ చేతుల్లోనే ఉండే అవకాశముందని విమర్శిస్తున్నాయి.

2021 ఫిబ్రవరిలో సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకుని, ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసింది. ఆమె నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్‌డీ) పార్టీకి రెండోసారి పాలించే అవకాశం లేకుండా చేసింది. 2023లో ఎన్ఎల్‌డీతో పాటు మరో 39 పార్టీలను సైనిక ప్రభుత్వం రద్దు చేసింది.

సైన్యం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇది కాస్తా ముదిరి ప్రస్తుతం దేశంలో పౌరయుద్ధం నడుస్తోంది. తాజాగా జరుగుతున్న ఎన్నికల సమయంలో కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. మొదటి విడత పోలింగ్ జరిగిన 102 పట్టణాల్లో 11 చోట్ల సైన్యానికి వ్యతిరేకంగా ఉన్న బృందాలు పోలింగ్ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశాయి. ఈ హింసాత్మక ఘటనల్లో ఐదుగురు గాయపడినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మొత్తంగా మయన్మార్ ఎన్నికలు రాజకీయంగా, భద్రతాపరంగా తీవ్ర వివాదాల మధ్య కొనసాగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయన్నది ఇంకా అనిశ్చితంగా ఉంది.