Let's talk: editor@tmv.in
మమ్మల్ని ఒంటరిని చేశారు.. నాటో తీరుపై ట్రంప్ ఆగ్రహం

మమ్మల్ని ఒంటరిని చేశారు.. నాటో తీరుపై ట్రంప్ ఆగ్రహం

Shaik Mohammad Shaffee
14 ఏప్రిల్, 2026

ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధ సమయంలో నాటో దేశాలు అమెరికాకు ఆశించిన స్థాయిలో సహకరించలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "మనం నాటో కోసం ట్రిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తున్నాం.. కానీ అవసరమైనప్పుడు వారు మన పక్కన లేరు" అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అండగా లేని 'కాగితపు పులి'

దశాబ్దాలుగా రష్యా ముప్పు నుంచి ఐరోపాను రక్షించేందుకు అమెరికా భారీగా నిధులను వెచ్చిస్తోందని ట్రంప్ గుర్తు చేశారు. ప్రస్తుతం నాటో దేశాలు చర్చలకు వస్తున్నప్పటికీ, ఇప్పుడు వాటి వల్ల అమెరికాకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ఆయన కొట్టిపారేశారు. నాటో వైఖరిని తప్పుబడుతూ, అది కేవలం ఒక ‘కాగితపు పులి’ అని ఆయన అభివర్ణించారు. గతంలో గ్రీన్ లాండ్ విలీనం వంటి అంశాల్లోనూ నాటో సహకరించలేదని, ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే పునరావృతమైందని ఆయన మండిపడ్డారు. నాటో చరిత్రలో ఇదొక చెరగని మచ్చగా మిగిలిపోతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అట్లాంటిక్ దేశాల మధ్య 'ఒత్తిడి పరీక్ష'

ట్రంప్ వ్యాఖ్యలపై జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్ స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితులు అట్లాంటిక్ దేశాల మధ్య సంబంధాలకు ఒక ‘స్ట్రెస్ టెస్ట్’ (ఒత్తిడి పరీక్ష) లాంటివని అభివర్ణించారు. రక్షణ రంగంపై ఐరోపా దేశాలు తమ వాటాను పెంచుకోవాలని ట్రంప్ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో అమెరికా-ఐరోపా దేశాల మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కూటమి నుంచి విడిపోవడం సాధ్యమేనా?

ట్రంప్‌నకు నాటో పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, అమెరికా ఆ కూటమి నుంచి తక్షణమే బయటకు రావడం అంత సులభం కాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. నాటో నుంచి తప్పుకోవాలంటే అమెరికా సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ లేదా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. అమెరికాలోని రెండు ప్రధాన పార్టీలకు చెందిన మెజారిటీ నాయకులు ఇప్పటికీ నాటోలో కొనసాగడానికే మొగ్గు చూపుతున్నారు.

ప్రత్యామ్నాయ చర్యలపై ట్రంప్ నజర్

ఒకవేళ నాటో కూటమి నుంచి అమెరికా పూర్తిగా బయటకు రాకపోయినా, తన మాట వినని దేశాలకు బుద్ధి చెప్పేందుకు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నాటో నిబంధనల ప్రకారం ఏదైనా సభ్య దేశంపై దాడి జరిగితే మిగిలిన దేశాలు సాయం చేయాలి, కానీ అది కచ్చితంగా యుద్ధం చేసి తీరాలని ఎక్కడా లేదు. దీన్నే సాకుగా చూపి, తనకు సహకరించని ఐరోపా దేశాలకు భవిష్యత్తులో సైనిక సాయం ఆపేయాలని ట్రంప్ భావిస్తున్నారు.

మరోవైపు, ఐరోపా అంతటా విస్తరించి ఉన్న సుమారు 84,000 మంది అమెరికా సైనికులను వెనక్కి పిలిపించడం లేదా తమకు ఇష్టం లేని దేశాల నుంచి సైనిక స్థావరాలను మార్చడం వంటి చర్యలకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధంలో అమెరికాకు అండగా నిలవని దేశాల విషయంలో ఆయన చాలా సీరియస్‌గా ఉన్నారు. ట్రంప్ తీసుకోబోయే ఈ నిర్ణయాలు ప్రపంచ రక్షణ వ్యవస్థలో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.