
మమత అవినీతి ఫలితమే ఆనంద్‌పూర్ అగ్ని ప్రమాదం: అమిత్ షా
కోల్కతాలోని ఆనంద్‌పూర్‌లో మోమో ఫ్యాక్టరీ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, అది మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అవినీతికి ప్రత్యక్ష ఫలితమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. శనివారం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు ముందుగా నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. ఆనంద్‌పూర్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం యాదృచ్ఛికం కాదు. మమతా ప్రభుత్వంలో వేళ్లూనుకున్న అవినీతి కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు.
ఈ వారంలో ఆనంద్‌పూర్‌లోని మోమో ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి పలువురు కార్మికులు మృతి చెందగా, మరికొందరు గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 21 నమూనాలను డీఎన్‌ఏ పరీక్షలకు పంపగా, 27 మంది కనిపించట్లేదని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అవినీతి చేసిన వారికి టికెట్లు ఇవ్వకుండా ఉండగలరా?
అదే సందర్భంలో మమతా బెనర్జీ ప్రభుత్వం మటువా, నామశూద్ర వర్గాలను భయభ్రాంతులకు గురిచేస్తోందని అమిత్ షా ఆరోపించారు. మీ ఓటు హక్కును ఎవరూ తీసుకోలేరు. ఎన్ఆర్సీకి మమతా ఎంత వ్యతిరేకించినా, అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సిందే అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మిగిలిపోయిన అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవినీతిపై మమతా బెనర్జీకి సవాల్ విసిరిన అమిత్ షా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకుండా నిరూపించాలని డిమాండ్ చేశారు. అలా చేయలేరు. ఎందుకంటే టికెట్లు ఇవ్వకపోతే మీ కుటుంబంలోని పేర్లు బయటపడతాయం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీని బెంగాల్‌కు అమూల్య రత్నంగా అమిత్ షా అభివర్ణించారు. ఆయన లేకపోతే బెంగాల్ బంగ్లాదేశ్‌లో కలిసిపోయేదని, కశ్మీర్ కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, త్వరలోనే 22వ రాష్ట్రంగా బెంగాల్‌లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
