Let's talk: editor@tmv.in
మమతా ‘విక్టిమ్‌ కార్డ్‌’ రాజకీయాలు చేస్తున్నారు:అమిత్ షా

మమతా ‘విక్టిమ్‌ కార్డ్‌’ రాజకీయాలు చేస్తున్నారు:అమిత్ షా

Pinjari Chand
29 మార్చి, 2026

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, టీఎంసీ ప్రభుత్వంపై బీజేపీ తరఫున ‘చార్జ్‌షీట్’ను శనివారం విడుదల చేశారు. ఎన్నికల ముందు మమతా బెనర్జీ ‘విక్టిమ్ కార్డ్’ రాజకీయాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. కొల్‌కత్తాలో జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ మమతా బెనర్జీ ఎప్పుడూ బాధితురాలిగా నటించే రాజకీయాలు చేస్తారు. కొన్నిసార్లు గాయపడ్డట్టు, కొన్నిసార్లు అనారోగ్యంగా నటిస్తూ ఎన్నికల సమయంలో ప్రజల సానుభూతి పొందాలని చూస్తారు. కానీ ఇప్పుడు బెంగాల్ ప్రజలు ఈ రాజకీయాలను పూర్తిగా అర్థం చేసుకున్నారని షా అన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా బెంగాల్‌లో మాత్రమే న్యాయాధికారులను నియమించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇది ఎందుకు జరిగింది? మమతా బెనర్జీ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.

అక్రమ చొరబాట్ల(ఇన్‌ఫిల్ట్రేషన్) అంశాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీ అధికారంలోకి వస్తే ఓటర్ల జాబితా నుంచే కాదు, దేశం నుంచే అక్రమ చొరబాటుదారులను తొలగిస్తామని స్పష్టం చేశారు. బెంగాల్ భవిష్యత్తును అక్రమంగా వచ్చిన వారు నిర్ణయించాలా? మేము ప్రతి ఒక్కరినీ గుర్తించి దేశం నుంచి పంపిస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. మే 6న బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, 45 రోజుల్లో సరిహద్దు కంచె పనులకు అవసరమైన భూమిని సమకూర్చి అక్రమ ప్రవేశాలను అరికడతామని ఆయన అన్నారు.

ఉద్యోగ నియామకాలలో వయస్సు సడలింపు ఇస్తాం

ఓబీసీ వర్గీకరణపై కూడా మమతా బెనర్జీపై విమర్శలు చేశారు. 77 సమాజాలను ఓబీసీ జాబితాలో చేర్చగా, అందులో 75 ముస్లిం వర్గాలేనని పేర్కొంటూ, మత ఆధారంగా ఓబీసీ నిర్ణయం తీసుకోవచ్చా? అని ప్రశ్నించారు. అదే సమయంలో, ఉద్యోగ నియామకాలలో జరిగిన అవినీతి కారణంగా వయోపరిమితి దాటిపోయిన యువతకు ఐదు సంవత్సరాల వయస్సు సడలింపు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎస్‌ఎస్‌సీ నియామకాల్లో వారికి అవకాశం కల్పించి పారదర్శక నియామక వ్యవస్థను అమలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.

బెంగాల్ ఎన్నికలు భయం వర్సెస్‌ విశ్వాసం మధ్య పోరాటంగా ఉంటాయని పేర్కొన్న షా, గత 15 సంవత్సరాలుగా టీఎంసీ పాలనలో అవినీతి, హింస, అబద్ధాల రాజకీయాలు నడిచాయని ఆరోపించారు. ‘సోనార్ బంగ్లా’ అనే కలను చూపించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. టీఎంసీ పాలనలో బెంగాల్ అవినీతి ప్రయోగశాలగా మారింది. సిండికేట్ వ్యవస్థ ప్రజలను వేధిస్తోంది. అభివృద్ధి లేక పరిశ్రమలు నశించాయని ఆయన ఆరోపించారు. 2011 నుంచి బీజేపీ ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడుతోందని, ఈసారి బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

మమతా ‘విక్టిమ్‌ కార్డ్‌’ రాజకీయాలు చేస్తున్నారు:అమిత్ షా - Tholi Paluku