
మమతా బెనర్జీ వైఖరిపై ఎన్. రామచందర్ రావు ఆగ్రహం
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుసరించిన తీరును తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన, ఇది కేవలం పొరపాటు కాదని, రాజకీయ అహంకారం, నిరాశతో కావాలనే చేసిన ప్రోటోకాల్ ఉల్లంఘన అని మండిపడ్డారు.
మమతా బెనర్జీ ప్రవర్తనను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత వైఖరితో రామచందర్ రావు పోల్చారు.మమతా బెనర్జీ భారత రాష్ట్రపతిని అవమానించారు. తన చర్యలను సరిచేయడానికి ప్రయత్నించారు. ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన ఉద్దేశపూర్వకంగా, కోపం, రాజకీయ అహంకారం వల్ల జరిగిందన్నారు. తెలంగాణలో కూడా కేవలం కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే రీతిలో ప్రవర్తన కనిపించిందని. ఆయన ప్రధానిని స్వాగతించలేదు. మమతా బెనర్జీ తీరును మేము ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.
డార్జిలింగ్‌లో జరిగిన 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సు ఏర్పాట్లపై రాష్ట్రపతి ముర్ము స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతాల్ ప్రజలు చేరుకోలేనంత దూరంలో వేదికను ఏర్పాటు చేయడంపై ఆమె అడ్మినిస్ట్రేషన్‌ను ప్రశ్నించారు. అలాగే, రాష్ట్రపతి పర్యటనలో ముఖ్యమంత్రి, మంత్రులు లేకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ, దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతికి తగిన గౌరవం ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు.
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ఈ అంశంపై స్పందిస్తూ, భారత గిరిజన ముద్దుబిడ్డ అయిన రాష్ట్రపతిని బెంగాల్‌లో అవమానించారు. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ హాజరుకాకపోవడం, సంతాల్ ప్రజలు చేరుకోలేని చోట వేదికను ఏర్పాటు చేయడం అత్యున్నత రాజ్యాంగ పదవిని అగౌరవపరచడమే అని కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా విమర్శించారు. టీఎంసీ ప్రభుత్వ తీరు సిగ్గుచేటని, దీనికి రాష్ట్రపతికి, సంతాల్ వర్గానికి తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
