Let's talk: editor@tmv.in
మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి

మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి

Pinjari Chand
17 మార్చి, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సోమవారం తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 144 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారిని నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దింపింది. ఈ నిర్ణయం ద్వారా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నేరుగా సవాల్ విసిరినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

నందిగ్రామ్ నియోజకవర్గం రాజకీయంగా కీలక ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. 2007లో జరిగిన భూసేకరణ వ్యతిరేక ఉద్యమంతో ఈ ప్రాంతం జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నందిగ్రామ్‌లో సువేందు అధికారి, మమతా బెనర్జీపై సుమారు 1,900 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరోవైపు భవానీపూర్ నియోజకవర్గం మమతా బెనర్జీకి బలమైన కోటగా భావిస్తారు. 2021 ఉపఎన్నికల్లో ఆమె ఇక్కడి నుంచి 58 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయినప్పటికీ అదే స్థానంలో అధికారి పోటీ చేయడం ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పోరుగా మారే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ విడుదల చేసిన జాబితాలో 41 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇచ్చింది. ఇందులో అగ్నిమిత్ర పౌల్‌(ఆసన్సోల్ సౌత్), చందన బౌరి (సాల్తోరా), శిఖాఛటర్జీ (డాబ్‌గ్రామ్–ఫుల్బారి) వంటి నేతలు ఉన్నారు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్ ఖరగ్‌పూర్ సదర్ నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తాను దక్షిణ కోల్‌కత్తాలోని రష్‌బెహారి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించారు.

23 ఉపాధ్యాయులకు టికెట్లు

పార్టీ ఈ జాబితాలో యువతకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. 40 ఏళ్లలోపు 36 మందికి టికెట్లు ఇచ్చింది. అలాగే ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు, మాజీ సైనికులు వంటి వివిధ రంగాల నుంచి 57 మందిని అభ్యర్థులుగా నిలబెట్టింది. ఉపాధ్యాయులు అత్యధికంగా 23 మంది ఉన్నారు. సినీ నటుడు రుద్రనీల్‌ ఘోష్‌కు కూడా టికెట్ ఇచ్చారు. భారత మాజీ క్రికెటర్ అశోక్‌దిండాను మొయ్నా నియోజకవర్గం నుంచి మళ్లీ అభ్యర్థిగా నిలబెట్టారు.

ఇదిలా ఉండగా ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)పై రాష్ట్రంలో రాజకీయ వివాదం కొనసాగుతోంది. భవానీపూర్‌లో మాత్రమే సుమారు 47 వేల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించగా, 14 వేల పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. నందిగ్రామ్‌లో కూడా దాదాపు 11 వేల పేర్లు తొలగించారు. నకిలీ ఓటర్లను తొలగించేందుకే ఈ ప్రక్రియ చేపట్టామని బీజేపీ చెబుతుండగా, ఓటర్ల జాబితాను ప్రభావితం చేసే ప్రయత్నమని టీఎంసీ ఆరోపిస్తోంది. కాగా పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి పోరు ఈసారి ప్రధాన చర్చగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి - Tholi Paluku